- ఈసీ ఆదేశాలతో పోలీసుల విస్తృత తనిఖీలు
- బెల్ట్ షాపులపై ముమ్మరంగా దాడులు
- బీఆర్ఎస్ లీడర్ పై కోడ్ ఉల్లంఘన కేసు
వనపర్తి, వెలుగు: ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో జిల్లా అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ కోడ్ ఉల్లంఘించిన వారిపై కేసులు పెడుతున్నారు. పెబ్బేరు మండలం పాతపల్లిలో ఓ ఆలయం వద్ద భోజనాలు ఏర్పాటు చేశారనే ఫిర్యాదుతో అక్కడి బీఆర్ఎస్ లీడర్ వనం రాములుపై కేసు నమోదు చేశారు. జిల్లా కేంద్రంతో పాటు మండల సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే రూ.29.53 లక్షలు, 913 లీటర్ల లిక్కర్పట్టుకున్నారు. ఇప్పటి వరకు 35 ఎక్సైజ్ కేసులు నమోదయ్యాయి. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్‌లు జిల్లాలోని బెల్ట్ షాపులను గుర్తించే పనిలో పడ్డాయి. నాలుగు టీమ్‌లు జిల్లాలో తిరుగుతూ రాజకీయ పార్టీల నేతల కదలికలపై ఎప్పటికప్పుడు కలెక్టర్, ఎస్పీలకు సమాచారం అందిస్తున్నారు.
అభ్యర్థులు ఖరారు కాకున్నా..
బీఆర్ఎస్ తప్ప మిగిలిన పార్టీల నుంచి ఎవరు బరిలో ఉంటారనేది ఇంకా ఖరారు కాకపోయినా, కోడ్ ఉల్లంఘనలపై కేసులు పెడుతున్నారు. అభ్యర్థులకు సంబంధం లేకపోయినప్పటికీ, ఎవరు ఖర్చు చేస్తున్నారో వారిపై కేసులు పెడుతున్నారు. వనపర్తి, కొల్లాపూర్, దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల పరిధిలో బెల్ట్‌షాపులపై నిఘా ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో ఒకటి నుంచి పది వరకు బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో జిల్లాలోని మద్యం దుకాణాల్లో లిక్కర్ అమ్మకాలపై ఆంక్షలు విధించారు. ఎక్కువగా లిక్కర్ అమ్ముడు పోయే షాపులపై నిఘా పెట్టారు. అలాగే ఒకే అకౌంట్నుంచి ఎక్కువ మందికి డబ్బులు ట్రాన్స్ ఫర్ అయితే డబ్బులు పంపిన వ్యక్తికి నోటీసులు జారీ చేస్తున్నారు. రూ.10 లక్షల కంటే ఎక్కువ జమ చేయడం, విత్‌డ్రా చేసిన వివరాలను బ్యాంకర్ల నుంచి సేకరిస్తున్నారు.
సమావేశాలపైనా..
రాజకీయ పార్టీలు సభలు, సమావేశాల పేరుతో చేస్తున్న ఖర్చుపై ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒక్కో వ్యక్తిపై ఖర్చు చేసే మొత్తాన్ని అంచనా వేసి ఆ పార్టీ అభ్యర్థి ఎన్నికల ఖర్చు కింద జమ చేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ ఏర్పాటు చేసిన సభలు, సమావేశాలు, ర్యాలీలపై ఆయా పార్టీ లీడర్లతో వివరాలు సేకరించారు. మరోవైపు జిల్లా కేంద్రంలో ఐదు చెక్ పోస్టులు, మండల కేంద్రాల్లో నలువైపులా ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో డబ్బు, మద్యం దొరుకుతోంది.
సామాన్య ప్రజలకు అవగాహన లేక రూ.50 వేల కంటే ఎక్కువ తీసుకెళ్తుండగా, అధికారులు సీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రూ.30 లక్షల వరకు ఆధారాలు లేని డబ్బును సీజ్ చేశారు. వాస్తవానికి వివిధ రాజకీయ పార్టీలు షెడ్యూల్ కంటే ముందే డబ్బు, మద్యం పెద్ద ఎత్తున గ్రామాలకు తరలించి నిల్వ చేశారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి వాటికి సంబంధించి సమాచారం ఇవ్వాలని ఆఫీసర్లు కోరుతున్నారు. కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎలక్షన్ కమిషన్ యాప్ లో అప్లోడ్ చేస్తే దానిని ఫిర్యాదుగా స్వీకరించి తనిఖీలు, దాడులు చేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. చెక్ పోస్ట్ లు, సాధారణ పౌరుల నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు దృష్టి సారించడంతో ఈ సారి జరిగే ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రభావం తగ్గవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గట్టి నిఘా ఏర్పాటు చేశాం..
జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశాం. డబ్బు, మద్యం ఓటర్లకు పంచకుండా స్పెషల్ టీమ్స్‌తో గస్తీ నిర్వహిస్తున్నాం. సమాచారం అందిన వెంటనే చేరుకునేలా మొబైల్ టీమ్‌లను సిద్ధం చేశాం. జిల్లా ప్రజలు ఎన్నికల ఉల్లంఘనలపై సమాచారం అందించి సహకరించాలి.
తేజస్ నందలాల్ పవార్, కలెక్టర్