దంచికొట్టిన వాన.. పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు

  • వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు
  • గాంధారి, లింగంపేట మండలాల్లో వరదల్లో చిక్కిన నలుగురు
  • పలు గ్రామాలకు స్తంభించిన రాకపోకలు 

నెట్​వర్క్​ వెలుగు: నెలరోజుల విరామం తర్వాత ఉమ్మడి జిల్లాలో వానలు దంచికొట్టాయి. నిజామాబాద్ జిల్లాలో 272 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. గోదావరి నదిలో 50,924 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగింది. నగరంలోని మాలేపల్లి, అర్సాపల్లి, రైల్వే స్టేషన్, మానిక్​బండార్​చౌరస్తాలో రోడ్డు మీదుగా వరద పారుతోంది. కొత్తగా మున్సిపల్​ కార్పొరేషన్​లో కలిసిన బొర్గాం, గుండారం, పాంగ్రా కాలనీల చుట్టూ నీరు చేరింది. ముప్కాల్​ మండలంలో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షం పడింది. మోపాల్​ మండలం మంచిప్ప ఊర చెరువు పూర్తిగా నిండి అలుగు పారింది. నిజామాబాద్​ మండలం పాంగ్రా శివారులోని కెనాల్​ఉప్పొంగడంతో వాగు సమీపంలోని కాలనీలోకి నీరు చేరింది. 

అధికారులు కాలనీవాసులను క్యాంపులోకి తరలించారు. కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. గాంధారి, సదాశివ్​నగర్, రామారెడ్డి, జుక్కల్, బిచ్కుంద, తాడ్వాయి, కామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లో భారీవానకు వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. తాడ్వాయి మండలం బ్రహ్మణ్​పల్లి, కాలోజీవాడి, సంగోజీవాడి, టెక్రియాల్​మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మాతు సంగెం వద్ద ఒకరు, లింగంపేట మండలం పార్మల్ల లో ముగ్గురు వ్యక్తులు వరదల్లో చిక్కుకుపోయ్యారు. మాతు సంగెం వద్ద వరదల్లో చిక్కుకున్న సంగయ్య అనే వ్యక్తిని ఎమ్మెల్యే జాజుల సురేందర్, కలెక్టర్​ఆధ్వర్యంలో ప్రత్యేక బోటులో సురక్షితంగా తీసుకొచ్చారు. 

లింగంపేటకు ఎగువ ఉన్న గాంధారి, సదాశివ్​నగర్​మండలాల్లో వాన దంచి కొట్టడంతో లింగంపేట పెద్దవాగుకు వరద ఉధృతి పెరిగింది.  లింగంపేట మండలంలోని నాగారం శివారు లో ఉన్న కాసులకత్త వంతెన వరదనీటిలో మునిగిపోయింది. నీటి ఉధృతికి వంతెనకు ఇరువైపుల ఉన్న బీటీ రోడ్డు కొట్టుకపోయి, నాలుగైదు మీటర్ల లోతు గోతులు ఏర్పడ్డాయి. దీంతో లింగంపేట నుంచి నాగారం, కొర్పోల్, బానాపూర్​గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 34 ఏండ్ల తర్వాత లింగంపేట పెద్దవాగు పొంగి పొర్లింది. ఆర్మూర్​టౌన్​లోని లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరగా, ఎమ్మెల్యే జీవన్​రెడ్డి పరిశీలించారు.  

గేట్ల ఎత్తివేత..

నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు ఎస్సారెస్పీకి భారీగా వరద వచ్చి చేరుతోంది. సోమవారం అధికారులు 4 గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ప్రాజెక్ట్ కు 50,924 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 9 వేల వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉన్నట్లు ప్రాజెక్ట్​ ఆఫీసర్లు చెప్పారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 89 టీఎంసీల వద్ద ఉన్నట్లు పేర్కొన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్​వద్ద 5 గేట్లను ఎత్తారు.  ఎగువ నుంచి 36,500 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కౌలాస్​నాలా వద్ద మూడు గేట్లు ఎత్తి 5016 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగిరెడ్డి పేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. ప్రాజెక్టులోకి 36,109 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని,అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.