- 2014లో బాలికపై లైంగికదాడి, హత్య కేసులో జీవిత ఖైదు
- 2014లో వనస్థలిపురంలో మిస్సింగ్..
- ప్రకాశం జిల్లాలో అస్థి పంజరం లభ్యం
- పక్కా ఆధారాలతో 2017లో చార్జిషీట్
- 2018 నుంచి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విచారణ..తాజాగా జడ్జిమెంట్
ఎల్బీనగర్, వెలుగు: ఓ బాలికపై పదేండ్ల కింద లైంగిక దాడి చేసి, హత్య చేయగా..ఈ కేసులో రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఆరేండ్ల పాటు విచారణ జరిపి తీర్పు వెలువరించింది. నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదుతో పాటు రూ.13 వేల జరిమానా విధించింది. చంపిన నెల రోజులకు బాలిక అస్థి పంజరం దొరకడంతో పోలీసులు ఫోరెన్సిక్‌ల్యాబ్‌కు పంపించి పటిష్టమైన ఆధారాలను సేకరించి కోర్టుకు సమర్పించారు. అయినా జడ్జిమెంట్ కోసం ఆరేండ్లు వేచిచూడాల్సి వచ్చింది.
అసలేం జరిగిందంటే..
2014లో ఏపీలోని ప్రకాశం జిల్లా ఎర్రారెడ్డిపల్లి లింగసముద్రానికి చెందిన దబ్బగోటి వెంకటేశ్ (33) వనస్థలిపురంలోని హస్తినాపురంలో ఉంటూ మేస్త్రీగా పని చేసేవాడు. వెంకటేశ్ కు ఇంటికి దగ్గర్లో ఉండే ఓ కుటుంబంతో పాత పరిచయం ఉంది. దీంతో చిట్టీ డబ్బులంటూ, ఇతర కారణాలతో వారి ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. ఆ దంపతులకు 16 ఏండ్ల కూతురు ఉండగా, ఇంట్లో బాలిక తల్లిదండ్రులు లేనప్పుడు చిట్టీకి సంబంధించిన డబ్బులు వారి కూతురికి ఇచ్చేవాడు. ఈ క్రమంలో ఆమెను ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పాడు. తనతో వస్తే పెండ్లి చేసుకుంటానని, డబ్బులు, బంగారం తీసుకువస్తే కష్టాలు ఉండవని నమ్మించాడు. దీంతో అతడిని నమ్మి వెంట వెళ్లింది.
దీంతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మన్ సాన్‌పల్లికి తీసుకువెళ్లి అక్కడ ఓ రూమ్ లో పలుమార్లు లైంగికదాడి చేశాడు. తర్వాత ఏమీ తెలియనట్టు వనస్థలిపురం వచ్చి బాలిక తల్లిదండ్రులతో కలిసి బాలిక కనిపించడం లేదంటూ కంప్లయింట్ చేశాడు. రెండు రోజుల పాటు అక్కడే ఉంచడంతో బాలిక అతడిని పెండ్లి విషయమై ప్రశ్నించింది. దీంతో ప్రకాశం జిల్లా లింగసముద్రానికి సమీపంలో గుడి ఉందని అక్కడ పెండ్లి చేసుకుంటానని తీసుకువెళ్లాడు. ఊరి శివారులోని అటవీ ప్రాంతానికి పట్టుకువెళ్లి లైంగికదాడి చేశాడు. తర్వాత గొంతు నులిమి హత్య చేశాడు. బతికి ఉందేమో అన్న అనుమానంతో తలపై బండతో పలుమార్లు కొట్టాడు. ఊపిరి పోయిందని నిర్ధారించుకున్నాక అక్కడే గొయ్యి తీసి పాతిపెట్టాడు. ఆమె దగ్గరున్న నగలు, డబ్బులు తీసుకుని మళ్లీ వనస్థలిపురం వచ్చాడు.
ఎలా బయటపడిందంటే..
వనస్థలిపురం వచ్చి ఏమీ తెలియనట్టే ఉండగా, మరోవైపు పోలీసులు విచారణ కొనసాగింది. పోలీసులు బాలిక స్నేహితులను విచారించినా ఆధారాలు దొరకలేదు. చివరకు బాలిక ఇంట్లో ఉండే సెల్‌ఫోన్ నుంచి ఎక్కడెక్కడికి కాల్స్ వెళ్లాయో చూశారు. అప్పటికే నెల గడిచిపోయింది. అందులో ఎక్కువసార్లు వెంకటేశ్‌తో మాట్లాడిందని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. పెండ్లి చేసుకోమని సతాయించడంతో తానే చంపి, పాతిపెట్టి నగలు తీసుకొని వచ్చానని అంగీకరించాడు. ఎత్తుకువచ్చిన నగలను అప్పగించాడు. అతడు చెప్పిన చోట తవ్వగా బాలిక అస్థి పంజరం బయటపడింది.
ఫోరెన్సిక్ రిపోర్టుతో కోర్టుకు ఆధారాలు..
పోలీసులు తమకు దొరికిన అస్థి పంజరంతో నేర నిరూపణ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. టెక్నికల్ఎవిడెన్స్ కోసం అప్పటి వనస్థలిపురం సీఐ, ఇన్వెస్టిగేషన్ఆఫీసర్ గోపాలకృష్ణమూర్తి శ్రమించారు. అస్తి పంజరం సదరు బాలికది అని నిర్ధారించడానికి బాలిక తల్లి పేరెంట్స్ శాంపిల్సేకరించి పరీక్షకు పంపారు. అదృశ్యమైన బాలికే అని తేలడంతో ఇన్వెస్టిగేషన్లో ముందుకు సాగారు.
గొంతు నులమడం వల్ల ఎముకలు విరిగాయని, తలపై బండరాయితో మోది చంపారని రిపోర్ట్ఇచ్చారు. అలాగే హత్య జరిగిన టైంలో ఆ ప్రదేశం లో నిందితుడి సెల్‌ఫోన్ సిగ్నల్స్ గుర్తించారు. మిస్సింగ్ కేసును ఐపీసీ 366 (కిడ్నాప్) 302 (మర్డర్),201(తప్పుడు సమాచారం ఇవ్వడం) 342 (నిర్బంధించడం) 379 (దొంగతనం), పోక్సో యాక్ట్ సెక్షన్5 (1) రెడ్ విత్6 సెక్షన్లు నమోదు చేసి ఆధారాలతో ఎల్బీనగర్కోర్టులో 2017లో చార్జిషీట్ ఫైల్ చేశారు. 2018 వరకు అక్కడే విచారణ కొనసాగింది.
ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుతో...
రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 2018లో ఏర్పాటు కావడంతో అదే ఏడాది డిసెంబర్లో కేసును బదిలీ చేశారు. అప్పటి నుంచి విచారణ కొనసాగింది. పక్కా టెక్నికల్ ఎవిడెన్స్‌తో నేర నిరూపణ చేయడంతో ఆరేండ్ల తర్వాత వెంకటేశ్‌కు యావజ్జీవ శిక్ష విధించింది. అయితే, అస్థి పంజరం దొరకడంతో లైంగికదాడి జరిగిందని నిరూపించలేకపోయారు. తీర్పుతో బాలిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఆలస్యమైనా తమ కూతురికి న్యాయం జరిగిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. నిందితుడికి శిక్ష పడేలా చేసిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.సునీతను వనస్థలిపురం సీఐ శ్రీనివాస్ రావు సన్మానించారు.
నా లైఫ్‌లో బెస్ట్ కేసు
నేను ఇన్వెస్టిగేషన్ చేసిన కేసుల్లో ఇది బెస్ట్ కేసు. పక్కాగా ఆధారాలు సేకరించడానికి రెండేండ్లు టైం పట్టింది. వెంకటేశ్ ఎక్కడా తప్పించుకోకూడదని మేం పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. నిందితుడు కేసును పక్కదారి పట్టించడానికి చాలా ప్రయత్నించాడు. డిఫెన్స్కూడా గట్టిగానే వాదించింది. అయినా, మేం సమర్పించిన ఎవిడెన్స్‌తో నిందితుడికి తగిన శిక్ష పడింది. న్యాయమే గెలుస్తుందనడానికి ఈ కేసు ఒక ఉదాహరణ.
– గోపాల కృష్ణమూర్తి అప్పటి ఐవో, ప్రస్తుత బేగంపేట్ ఏసీపీ –