బంగ్లాదేశ్: బంగ్లాదేశ్ లో మైనారిటీలపై వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి. మైనారిటీలే టార్గెట్ గా జరిగిన మత కల్లోలాల్లో మొత్తం 88 ఘటనలు జరిగినట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ధృవీకరించింది. ముఖ్యంగా బంగ్లాలోని హిందువులే లక్ష్యంగా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. అయితే భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ బంగ్లాదేశ్ ను సందర్శించిన అనంతరం ఈ ప్రకటన వెలువడటం విశేషం. బంగ్లాతో మైత్రి పూర్వకమైన బంధాన్ని ఆకాంక్షిస్తున్నామని, మైనారిటీలపై.. ముఖ్యంగా హిందువులపై దాడులను ఉపేక్షించేది లేదని విక్రమ్ మిస్త్రీ బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
Also Read :- మహా కుంభమేళాకు ప్రత్యేక రైలు.. వివరాలు వెల్లడించిన ఐఆర్సీటీసీ
మైనారిటీలపై దాడులు హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత ఎక్కువయ్యాయి. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశాన్ని విడిచి వెళ్లిన తర్వాత హిందువులపై ఇప్పటి వరకు 88 ఘటనలు జరిగినట్లు బంగ్లా ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆగస్టు 5 నుండి అక్టోబర్ 22 మధ్య ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని, ఈ ఘర్షణల్లో మొత్తం 77 మందిని అరెస్టు చేసినట్లు మధ్యంతర ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనుస్ కార్యదర్శి షఫీకుల్ ఆలమ్ తెలిపారు.