- అవినీతి ఆరోపణలతో బీజేపీలో చేరిన 25 మంది ప్రతిపక్ష నేతలు
- వారిలో 23 మందికి దర్యాప్తు సంస్థల విచారణ నుంచి రిలీఫ్
- ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక వెల్లడి
వెలుగు సెంట్రల్ డెస్క్ : అవినీతి కేసులున్న ప్రతిపక్ష నాయకులు బీజేపీలో చేరగానే వారికి విచారణ నుంచి రిలీఫ్ దొరుకుతున్నదని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక తేల్చింది. 2014లో ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 25 మంది ప్రతిపక్ష నాయకులు బీజేపీలో చేరారని.. వారిలో ఇప్పటిదాకా 23 మంది దర్యాప్తు సంస్థల విచారణ నుంచి ఉపశమనం పొందారని వెల్లడించింది.
మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని గతకొంత కాలంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీని "వాషింగ్ మెషిన్"గా కూడా అభివర్ణించాయి. ఈ ఆరోపణలపై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ స్టడీ చేపట్టింది. దానికి సంబంధించిన రిపోర్టును తాజాగా రిలీజ్ చేసింది.
కాంగ్రెస్ నేతలే ఎక్కువ
బీజేపీలో చేరిన తర్వాత దర్యాప్తు సంస్థల నుంచి రిలీఫ్ పొందిన 25 మంది ప్రతిపక్ష నాయకుల్లో అత్యధికంగా కాంగ్రెస్ నుంచే10 మంది ఉన్నారని రిపోర్ట్ వెల్లడించింది. అలాగే.. ఎన్‌సీపీ, శివసేన నుంచి నలుగురు చొప్పున, తృణమూల్ కాంగ్రెస్ నుంచి ముగ్గురు, టీడీపీ నుంచి ఇద్దరు, సమాజ్ వాదీ పార్టీ, వైఎస్సార్‌సీపీ నుంచి ఒక్కొక్కరు ఉన్నారని వివరించింది. 25 మంది నాయకుల్లో 6 మంది నేతలు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కొద్ది వారాల ముందే బీజేపీలో చేరారని.. దాంతో వారిపై దర్యాప్తు నిలిచిపోయిందని తెలిపింది. జాబితాలో మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకులే 12 మంది ఉన్నారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ వెల్లడించగా.. బీజేపీలోకి చేరగానే ఎన్సీపీ అగ్రనేతలు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్‌పై నమోదైన కేసులు మూతపడ్డాయని పేర్కొంది.
జాబితాలోని ప్రముఖులు వీళ్లే..
2014 తర్వాత ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సహా కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకున్న ప్రముఖ రాజకీయ నాయకుల్లో కనీసం 95 శాతం మంది ప్రతిపక్షాలకు చెందినవారేనని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం.. బీజేపీలో చేరి అవినీతి కేసుల్లో రిలీఫ్ పొందిన వారి జాబితాను పరిశీలిస్తే.. కాంగ్రెస్ నుంచి హిమంత బిస్వా శర్మ 2015లో బీజేపీలో చేరగా..2024లో అశోక్ చవాన్, నవీన్ జిందాల్, గీతా కోడా, బాబా సిద్ధిఖీ కాషాయ కండువా కప్పుకున్నారు.
అలాగే..ఎన్సీపీ నుంచి అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, చగన్ భుజబల్ 2023లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలోకి చేరారు. ఎస్పీ నుంచి సంజయ్ సేథ్ 2019లో, సువేందు అధికారి 2020లో టీఎంసీ నుంచి బీజేపీలో జాయిన్ అయ్యారు. వీరిలో కొందరి కేసులు పూర్తిగా క్లోజ్ అవ్వగా..మరి కొందరి కేసులు హోల్డ్‌లో పడ్డాయి. కాగా..కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ దర్యా ప్తు సంస్థలను దుర్వినియోగం అయినట్లు రిపోర్ట్ వెల్లడించింది. అవినీతి కేసులున్న బీఎస్పీ నేత మాయావతి, ఎస్పీకి చెందిన ములాయం సింగ్ యాదవ్ 2009లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏలో చేరారని తెలిపింది. దాంతో వారిపై సీబీఐ దర్యాప్తు నిలిచిపోయిందని వివరించింది.
సీజేఐ ఆందోళన
కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన దర్యాప్తు సంస్థలు జాతీయ భద్రత, ఆర్థిక నేరాల నేరాలకు సంబంధించిన అంశాలపై మాత్రమే దృష్టి పెట్టాలని సూచించారు. ఇండియా కూటమి చేస్తున్న 'కేంద్ర సంస్థల దుర్వినియోగం' ఆందోళనలకు పరిష్యారం చూపాలని ఎన్నికల సంఘం కూడా యోచిస్తున్నట్లు సమాచారం .