- అసెంబ్లీ ఫలితాలపై ఇప్పటి వరకు నో రివ్యూ
- నియోజకవర్గ ఇన్చార్జినీ నియమించలే
- పార్టీ వీడుతున్న లీడర్లు, క్యాడర్
కామారెడ్డి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. పార్టీకి మంచి పట్టు ఉన్న సెగ్మెంట్లోనే అధినేత ఓడిపోవడం గులాబీ వర్గాలను విస్మయానికి గురి చేసింది. ఫలితాల తర్వాత పార్టీ ముఖ్య నేతలు ఇక్కడి శ్రేణులను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటివరకు నియోజకవర్గస్థాయి మీటింగ్ నిర్వహించలేదు. కనీసం ఫలితాలపై రివ్యూ చేయలేదు. దీనికి తోడు పార్టీకి నియోజకవర్గ ఇన్చార్జి ఎవరో తెలియక శ్రేణుల్లో సందిగ్ధత నెలకొంది. గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న కామారెడ్డిలో ఇప్పుడు గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య లీడర్లు కారు దిగుతున్నారు. దీంతో క్యాడర్లో అయోమయం నెలకొంది.
ఇన్చార్జి ఎవరు?
పార్టీ నియోజక వర్గ ఇన్చార్జి బాధ్యతలను ఇంతవరకు ఎవరికీ అప్పగించలేదు. ఎన్నికల ముందు ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్ అన్నీ తానై వ్యవహరించారు. ఎన్నికల టైమ్‌లో ఆ బాధ్యతలను కేటీఆర్ తీసుకున్నారు. ఫలితాల తర్వాత ఇన్చార్జి ఎవరనే విషయంలో స్పష్టత లేదు. అధినేత ఓటమితో ముఖ్య నేతలంతా క్యాడర్‌తో అంటీముట్టన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందే ఇక్కడి శ్రేణులతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమవుతారని చెప్పినప్పటికీ, ఫలితాల తర్వాత కూడా సమావేశం జరగలేదు. కొద్ది రోజుల కింద హైదరాబాద్‌లో జహీరాబాద్ పార్లమెంట్‌పై రివ్యూ చేశారు. కానీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంపై మాత్రం ఎలాంటి రివ్యూ జరగలేదు. పలువురు పార్టీని వీడుతున్నప్పటికీ దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తొమ్మిది నుంచి రెండుకు
బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి వెన్నంటి నిలిచిన కామారెడ్డి నియోజకవర్గంలోనే ఆ పార్టీ అధినేత ఓడిపోవడం ముఖ్యనేతలకు మింగుడు పడడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడం ద్వారా ఉమ్మడి జిల్లాపై ప్రభావం చూపుతుందని అంచనా వేశారు.ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉండగా, అంతకు మందు ఈ తొమ్మిది స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు.
తాజా ఎన్నికల్లో 7 సిట్టింగ్ స్థానాలను కోల్పోయిన బీఆర్ఎస్, 2 చోట్ల విజయంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ను కాదని కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీ చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గ బాధ్యతలు చూశారు. స్థానికంగా విస్తృతంగా పర్యటించి, క్షేత్రస్థాయిలో ప్రచార బాధ్యతల కోసం ముఖ్య లీడర్లతో కోఆర్డినేషన్ కమిటీ వేశారు. రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలంతా నియోజకవర్గంలోనే ఉండి హడావుడి చేశారు. ఫలితాల్లో కేసీఆర్‌కు 59,911 ఓట్లు రాగా, బీజేపీ విజయం సాధించింది. ఫలితాలు ప్రతికూలంగా రావడంతో బీఆర్ఎస్ కోటకు బీటలు వారాయి. మండల, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ లీడర్లు, కౌన్సిలర్లు చాలా మంది బీఆర్ఎస్ను వీడారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా ఇటీవల బీజేపీలో చేరారు.