కేసీఆర్ ​కుటుంబం తర్వాత ..జైలుకు పోయేది జగదీశ్​రెడ్డే : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  •     యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లలో సగం వాటా ఆయనదే..
  •     పార్లమెంట్​ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్​ ఎమ్మెల్యేల్లో సగం మంది జైలుకు పోతరు..  
  •     వచ్చే ఎలక్షన్లలో వాళ్లకు ఒక్కసీటు కూడా రాదు

నల్గొండ, వెలుగు :  పవర్​లేని మాజీ పవర్​మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి జైలుకు పోవుడు ఖాయమని, కేసీఆర్​కుటుంబం తర్వాత జైలుకు పోయే రెండో వ్యక్తి ఆయనే అని ఆర్అండ్​బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం నల్గొండలో విలేకరులతో మాట్లాడుతూ యాదాద్రి థర్మల్​పవర్​ప్లాంట్​పై సిట్టింగ్​జడ్జితో విచారణ జరిపిస్తున్నామని, భద్రాద్రి పవర్​ప్లాంట్​లోనూ భారీ కుంభకోణం జరిగిందన్నారు. ఈ రెండింటిలో సగం వాటా కేసీఆర్​కుటుంబానికి పోతే, ఇంకో సగం జగదీశ్​రెడ్డికి పోయిందన్నారు. టూ వీలర్​ కూడా లేని జగదీశ్​రెడ్డికి షాబాద్​మండలంలో 80 ఎకరాల్లో ఫాంహౌజ్​ ఎలా వచ్చిందని, దాని విలువ రూ.3 వేల కోట్లు ఉంటుందన్నారు.

సొంత ఊరు నాగారంలో రూ.50 కోట్ల ఖరీదైన బిల్డింగ్ ఉందన్నారు. ఎన్టీఆర్​హయాంలో మద్య నిషేధం అమల్లో ఉంటే దొంగతనంగా మిర్యాలగూడకు మద్యాన్ని తరలించి జైలు పాలైన చరిత్ర జగదీశ్​రెడ్డిదన్నారు. ఇంకా ఆ కేసు ఎక్సైజ్​డిపార్ట్​మెంట్​లో ఉందన్నారు. అలాంటి క్యారక్టర్​ లేని వ్యక్తి తన గురించి మాట్లాడం సిగ్గుచేటన్నారు. పార్లమెంట్​ఎన్నికలయ్యాక బీఆర్ఎస్​లో ఒక్కరు కూడా మిగిలరన్నారు. 39 మంది ఎమ్మెల్యేల్లో పది మంది కూడా మిగలరని, సగం మంది జైలుకు పోవుడు ఖాయమన్నారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ఒక్క సీటు కూడా రావడం కష్టమన్నారు. వాళ్ల పార్టీలో బావబామ్మర్దుల కొట్లాట నడుస్తోందని, ఇంకో వైపు కవిత, సంతోష్​మధ్య వార్​జరుగుతోందన్నారు.