'లాపతా లేడీస్’ (Laapataa Ladies).. భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్ 2025 బరిలో ఈ మూవీ నిలిచిన విషయం తెలిసిందే. మార్చి 1న థియేటర్లలో రిలీజైన లాపతా లేడీస్ సినిమాలో..సమాజంలో మహిళల పరిస్థితులను చూపిస్తూ తెరకెక్కిన ఈ కామెడీ డ్రామా మూవీపై చాలా ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహించారు.
అయితే.. బాలీవుడ్ 'లాపతా లేడీస్’.. భారత్ నుంచి అధికారికంగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. మరో బాలీవుడ్ మూవీ ఈ ప్రతిష్ట్మాకమైన గౌరవాన్ని పొందడంలో విజయం సాధించింది. 2024 మే 20న రిలీజైన 'సంతోష్' (Santosh) మూవీ ఆస్కార్ 2025కి ఎంపికైంది. ఆస్కార్ లిస్ట్ ప్రకటించి మూడు రోజులయ్యాక.. మరో మూవీ అనౌన్స్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఒక ట్విస్ట్ ఉంది. వివరాల్లోకి వెళితే..
సంధ్యా సూరి తెరకెక్కించిన 'సంతోష్' మూవీ 'UK ఆస్కార్స్ 2025' కోసం ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్‌గా ఎంపికైంది. ఈ చిత్రంలో భారతీయ నటీనటులు షహానా గోస్వామి మరియు సునీతా రాజ్‌వర్ ప్రధాన పాత్రల్లో నటించారు. షహానా గోస్వామి ఇందులో సంతోష్‌గా నటించింది.
ఎంపిక ఎలా జరిగింది?
ఈ ఏడాది 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం అన్ సెర్టైన్ రికార్డ్‌లో ప్రదర్శించబడింది. అక్కడ భారీ స్థాయిలో విడుదల కావడం, దానికి బ్రిటీష్ నిర్మాతల మద్దతు ఉండడంతో సంతోష్ మూవీ యూకే నుంచి ఎంపికవ్వడం జరిగింది. ఈ చిత్రాన్ని మైక్ గుడ్‌రిడ్జ్, జేమ్స్ బాషర్, బాల్తాజర్ డి గనే మరియు అలాన్ మెక్‌అలెక్స్ నిర్మించారు. అమా అంపడు, ఎవా యేట్స్, డైర్మిడ్ స్క్రిమ్‌షా, లూసియా హాస్లౌర్ మరియు మార్టిన్ గెర్హార్డ్ దీని ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. UK ప్రెజెంటేషన్‌ను ఎంపిక చేసేందుకు అమెరికన్ అకాడమీ నియమించిన బాఫ్టా అనే సంస్థ ఈ చిత్రాన్ని ఎంపిక చేసిందని డెడిన్ తెలిపారు.
సంతోష్’ కథ ఏంటి?
సంధ్య సూరి రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా కథ ఉత్తర భారతదేశంలోని ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. కొత్తగా పెళ్లయిన ఓ మహిళ సంతోష్ (షహానా గోస్వామి) ..కొంతకాలం తర్వాత ఆమె భర్త చనిపోవడంతో..ఒక ప్రభుత్వ పథకం ద్వారా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం పొందుతుంది. ఈ క్రమంలో నిమ్న కులాల దళిత సమాజానికి చెందిన ఒక టీనేజ్ అమ్మాయికి సంబంధించిన క్రూరమైన హత్యను ఛేదించే కేసులోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ కఠినమైన కేసును ఇన్వెస్టిగేటివ్ చేస్తున్న అనుభవజ్ఞుడైన డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ శర్మ (సునీతా రాజ్‌వార్)తో కలిసి ఆ మైనర్ బాలిక కేసును విచారించడం ప్రారంభిస్తుంది. అయితే, ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తన దృష్టికి ఎన్నో విషయాలు వస్తాయి. వివక్షతతో కూడిన సమాజంలో.. పనిచేసే మహిళలు ఎలా అణిచివేయబడుతున్నారు? ఇటువంటి విషయాలను వెలుగులోకి తీసుకురావడానికి సంతోష్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ శర్మ ఏం చేశారనేది కథ.