కోల్‌కతాలోని జేబు దొంగల ముఠా బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తున్న మొబైల్ ఫోన్‌లను లాక్కొని బ్యాంకింగ్ యాప్‌లను యాక్సెస్ చేసి డబ్బును దోచుకోవడం ట్రెండింగ్ గా మారింది. తాజాగా ఫోన్ లాక్కున్న 15 నిమిషాల్లోనే ఓ బాధితుడు రూ.42వేలు పోగొట్టుకున్నాడు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అయితే ఈ కేసులోనూ దొంగలు చాలా అధునాతనమైన టెక్నిక్ ను ఉపయోగించారు. దొంగిలించబడిన ఫోన్‌లలో సేవ్ అయిన వ్యక్తిగత వివరాలను లక్ష్యంగా చేసుకున్నారు. మొబైల్ ఫోన్ యూజర్స్ సులభంగా చూసే విధంగా పాస్‌వర్డ్‌లను సేవ్ చేయవద్దని, పిన్ లేదా బయోమెట్రిక్ ప్రమాణీకరణను ఉపయోగించాలని పోలీసులు ఈ సందర్భంగా సూచిస్తున్నారు.
బాధితుడు కెస్టోపర్ నివాసి అయిన శంకర్ ఘోష్ తెలిపిన వివరాల ప్రకారం అతను బెహలాలోని తన ఆఫీస్ నుంచి ఇంటికి బస్సులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తాను బస్సులో కిటికీ దగ్గర కూర్చొని, ఫోన్ లో ఏదో మెసేజ్ చేస్తూ బిజీగా ఉన్న సమయంలో దొంగలు సడెన్ గా వచ్చి కిటికీలోనుంచి తన ఫోన్ ను లాక్కొని వెళ్లినట్టు చెప్పాడు. తనకు ఏం జరిగిందో తెలిసే లోపు ఆ దొంగ అక్కడ్నుంచి పారిపోయాడని, తన మొబైల్ పోయిన 15నిమిషాల్లోనే తన బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.42వేలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై ఘోష్.. రెండు ఫిర్యాదులను సమర్పించాడు.
అందులో ఒకటి కొత్త అలిపోర్ పీఎస్ లో మొబైల్ పోయిందని, మరొకటి తన డబ్బు పోయిందని బిదాన్ నగర్ లోని సైబర్ సెల్ కు ఘోష్ కంప్లైంట్ చేశాడు. తాను మొబైల్ లో పాస్ వర్డ్స్ ను సేవ్ చేయలేదని, అయినా కూడా తన డబ్బు కోల్పోయానని అతను చెప్పాడు. లేదంటే తన ఫోన్ హ్యాక్ చేసి ఉండవచ్చని అతను అన్నాడు. ఈ విషయంపై కేసు ఫైల్ చేసిన అధికారులు.. దర్యాప్తు చేస్తున్నారు.