- 7 వికెట్ల తేడాతో గెలిచిన పాకిస్తాన్
- రాణించిన షాహీన్, జమాన్, షఫీక్
కోల్‌కతా: వన్డే వరల్డ్‌కప్‌లో వరుసగా ఆరో మ్యాచ్‌లో ఓడిన బంగ్లాదేశ్ సెమీఫైనల్ రేసు నుంచి వైదొలిగింది. వరుసగా నాలుగు పరాజయాలతో డీలా పడ్డ పాకిస్తాన్మళ్లీ గెలుపు బాట పట్టింది. సెమీఫైనల్ చేరే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో బంగ్లాదేశ్ పని పట్టింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో7 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. టోర్నీలో మూడో విక్టరీతో పాటు రన్‌రేట్ పెంచుకొని ఐదో ప్లేస్‌కు చేరుకుంది. వన్‌సైడ్ మ్యాచ్‌లో తొలుత బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 రన్స్‌కే ఆలౌటైంది.
మహ్ముదుల్లా (70 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 56), లిటన్ దాస్ (45), కెప్టెన్షకీబ్ అల్ హసన్ (43) రాణించారు. పాక్ బౌలర్లలో షాహీన్ షా ఆఫ్రిది, మొహమ్మద్ వసీం మూడేసి వికెట్లు పడగొట్టగా, హారిస్ రవూఫ్ రెండు వికెట్లు తీశాడు. ఛేజింగ్‌లో పాక్ 32.3 ఓవర్లలోనే 205/3 స్కోరు చేసి గెలిచింది. ఫఖర్జమాన్ (74 బాల్స్‌లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 81), అబ్దుల్లా షఫీక్ (69 బాల్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68) సత్తా చాటారు. మెహిదీ హసన్ మిరాజ్ మూడు వికెట్లు తీశాడు. జమాన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
పేసర్ల తడాఖా
టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ను పాక్ పేసర్లు వణికించారు. షాహీన్, రవూఫ్, వసీం ముప్పేట దాడి చేయడంతో వరుసగా వికెట్లు కోల్పోయిన బంగ్లా తక్కువ స్కోరుకే పరిమితమైంది. తొలుత కొత్త బాల్‌తో షాహీన్ ప్రత్యర్థి టాపార్డర్‌ను దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ ఐదో బాల్‌కే ఓపెనర్ తన్జిత్ హసన్ (0)నే ఎల్బీ చేసి వన్డేల్లో తన వందో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. తన తర్వాతి ఓవర్లోనే ఉసామా మిర్ పట్టిన డైవింగ్ క్యాచ్‌తో నజ్ముల్ శాంటో (4)ను కూడా వెనక్కుపంపాడు. ఆరో ఓవర్లో సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ (5)ను రవూఫ్ ఔట్ చేయడంతో బంగ్లా 23/3తో కష్టాల్లో పడ్డది.
ఈ దశలో మరో ఓపెనర్ లిటన్, మహ్ముదుల్లా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వసీం, ఉసామా బౌలింగ్‌లో ఇద్దరూ స్వేచ్ఛగా బౌండ్రీలు కొడుతూ రన్స్ రాబట్టారు. నాలుగో వికెట్‌కు 79 రన్స్ జోడించి స్కోరు వంద దాటించడంతో బంగ్లా కోలుకుంది. కానీ, లిటన్‌ను ఔట్ చేసిన స్పిన్నర్ ఇఫ్తికార్ పాక్‌కు కీలక బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత మరోసారి బౌలింగ్‌కు వచ్చిన షాహీన్ సూపర్ డెలివరీతో మహ్ముదుల్లాను క్లీన్‌బౌల్డ్ చేశాడు. తౌహిద్ (7)కూడా ఫెయిలవడంతో బంగ్లా 140/6తో మరింత డీలా పడింది. చివర్లో మెహిదీ హసన్ (25)తో ఏడో వికెట్‌కు కీలకమైన 45 రన్స్ జోడించి కెప్టెన్ షకీబ్.. రవూఫ్ షార్ట్‌బాల్‌కు వికెట్ ఇచ్చుకున్నాడు. స్కోరు 200 దాటాక మెహిదీ హసన్‌తో పాటు చివరి రెండు వికెట్లు పడగొట్టిన వసీం బంగ్లాను ఆలౌట్ చేశాడు.
ఓపెనర్ల జోరు
ఓపెనర్లు ఫఖర్జమాన్, అబ్దుల్లా షఫీక్ దంచికొట్టడంతో చిన్న టార్గెట్‌ను పాక్ ఈజీగా ఛేజ్ చేసింది. బంగ్లా బ్యాటర్లు తడబడ్డ వికెట్‌పై జమాన్, షఫీక్ ఆరంభం నుంచే బౌండ్రీల మోత మోగించారు. షఫీక్ ఫోర్లతో అలరించగా.. జమాన్ వరుస సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరి జోరుకు 18 ఓవర్లకే స్కోరు వంద దాటింది. ఈ క్రమంలో షఫీక్ 56 బాల్స్‌లో, జమాన్ 52 బాల్స్‌లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. ఫిఫ్టీ దాటిన తర్వాత షఫీక్ సైతం రెండు సిక్సర్లతో మరింత స్పీడు పెంచాడు. దాంతో, ఇద్దరే టార్గెట్‌ను ఛేజ్ చేసేలా కనిపించారు.
అయితే, 22వ ఓవర్లో షఫీక్‌ను ఎల్బీ చేసిన మెహిదీ హసన్ తొలి వికెట్‌కు 128 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేశాడు. మెహిదీ హసన్ బౌలింగ్‌లోనే ఇంకో రెండు సిక్సర్లు కొట్టిన జమాన్ స్కోరు 150 దాటించాడు. ఈ టైమ్‌లో కెప్టెన్ బాబర్ (9)తో పాటు సెంచరీ దిశగా దూసుకెళ్తున్న జమాన్‌ను మెహిదీ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చినా అప్పటికే మ్యాచ్ పాక్ చేతుల్లోకి వెళ్లింది. రిజ్వాన్ (26 నాటౌట్), ఇఫ్తికార్ (17 నాటౌట్) గెలుపు లాంఛనం పూర్తి చేశారు.
100 షాహీన్ షా ఆఫ్రిది వన్డేల్లో వేగంగా వంద వికెట్లు తీసిన పాకిస్తాన్ ప్లేయర్‌గా నిలిచాడు. 51 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించి సక్లయిన్ ముస్తాక్ (53 మ్యాచ్‌లు)ను రికార్డు బ్రేక్ చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్: 45.1 ఓవర్లలో 204 ఆలౌట్ ( మహ్ముదుల్లా56, లిటన్ 45, షాహీన్ 3/23, వసీం 3/31).
పాకిస్తాన్: 32.3 ఓవర్లలో 205/3 (జమాన్ 81, షఫీక్ 68, మిరాజ్ 3/60)