- అత్తింటి వేధింపులే కారణం
గండిపేట్, వెలుగు: అత్తింటి వేధింపులు తాళలేక పెండ్లయిన ఆరునెలలకే నవవధువు సూసైడ్ చేసుకుంది. సీఐ వెంకట్ రామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్ పాండు రంగానగర్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ స్వామికి కామారెడ్డి జిల్లా మద్నూర్‌కు చెందిన సిద్ధేశ్వరి(20)తో ఆరు నెలల కిందట వివాహం జరిగింది. పెండ్లయిన కొద్దిరోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.
ఈ క్రమంలోనే కట్నం తక్కువగా ఇచ్చారని అత్తమామలు సూటిపోటి మాటలతో సిద్ధేశ్వరిని మానసికంగా వేధించారు. అలాగే పిల్లల కోసం ఒత్తిడి పెంచారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సిద్ధేశ్వరి బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని మృతి చెందింది. భర్త ప్రవీణ్ పని నుంచి ఇంటికొచ్చేసరికి భార్య విగతజీవిగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అత్తాపూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని, డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. సిద్ధేశ్వరి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.