మూసీ ప్రాజెక్టు పూర్తయితే అద్భుత ఫలితాలు

మూసీ ప్రాజెక్టు పూర్తయితే అద్భుత ఫలితాలు
  • అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్

వికారాబాద్, వెలుగు: మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలో అద్భుతమైన ఫలితాలు వస్తాయని అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్ చెప్పారు. ప్రభుత్వం ఏ ప్రాజెక్టు చేపట్టినా కొంత వ్యతిరేకత రావడం సహజమన్నారు. అయితే దీర్ఘకాలంలో అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. ప్రజలంతా మూసీ పునరుజ్జీవనానికి సహకరించాలని కోరారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం వికారాబాద్​లోని శ్రీఅనంత పద్మనాభ కాలేజీలో ‘హనుమంతరావు వాటర్ కాన్సెప్ట్.. వికారాబాద్ లో నీటి భద్రత.. మూసీ నది పునరుజ్జీవనం’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 

స్పీకర్​తోపాటు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి, పర్యావరణవేత్త పురుషోత్తంరెడ్డి, దొంతి నర్సింహారెడ్డి, ట్రస్ట్ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి  హయాంలో కోటిపల్లి, నందివాగు, సర్పన్ పల్లి వంటి మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి జిల్లాలోని కొంత ప్రాంతానికి నీళ్లందించడానికి సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారని తెలిపారు. జిల్లా పరిషత్​మాజీ చైర్మన్​సునీతారెడ్డి, దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానంద్ రెడ్ది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హౌజింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్ది తదితరులు పాల్గొన్నారు.

లగచర్ల నిందితులను పోలీసులు గుర్తిస్తారు

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్, అధికారులపై దాడి చేసిన వారిని పోలీసులు గుర్తిస్తున్నారని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన మంగళవారం లగచర్ల ఘటనపై స్పందించారు. ఆ ఘటన జరిగిన సమయంలో తాను విదేశీ పర్యటనలో ఉన్నానని చెప్పారు. దాడి చేసిన వారిని పోలీసులు తప్పకుండా గుర్తించి అరెస్టు చేస్తారన్నారు. ఇంత కంటే తాను ఎక్కువ మాట్లాడలేనన్నారు.