మూసీ నిర్వాసితులను  కన్నబిడ్డల్లా చూస్కుంటం

మూసీ నిర్వాసితులను  కన్నబిడ్డల్లా చూస్కుంటం
  • పేదలను నిలబెట్టాలన్నదే మా ఉద్దేశం
  • పడగొట్టాలని కాదు.. : మంత్రి శ్రీధర్​బాబు
  • డబుల్ ​బెడ్రూం ఇండ్లతోపాటు ఉపాధి కల్పిస్తం 
  • ఎస్​హెచ్​జీ ద్వారా వడ్డీలేని రుణాలు ఇప్పిస్తం
  • హైడ్రా విషయంలో ఎవరైనా ఒక్కటే.. సీఎం అన్నకు నోటీసులిచ్చినం
  • హైడ్రా, మూసీ ప్రక్షాళనపై హెల్ప్‌‌ డెస్క్​లు ఏర్పాటు చేస్తం
  • అరాచక శక్తులను బీఆర్ఎస్​ ప్రోత్సహిస్తున్నది
  • డబ్బులిచ్చి సీఎం, సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నదని ఫైర్


హైదరాబాద్, వెలుగు: మూసీ నిర్వాసితులందరినీ రాష్ట్ర ప్రభుత్వం కన్నబిడ్డల్లా కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు. బాధితులందరికీ ఉపాధి కల్పించేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు ప్రయత్నాలు చేస్తున్నాయని వెల్లడించారు. మూసీ ప్రక్షాళన కోసం రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసి, హైదరాబాద్​ను విశ్వ నగరం చేయాలన్న ఉద్దేశంతోనే చెరువులు, మూసీలోని ఆక్రమణలను తొలగిస్తున్నట్టు చెప్పారు.

ఆదివారం సీఎల్పీలో విప్ అడ్లూరి లక్ష్మణ్​తో కలిసి మంత్రి  శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు కొందరు అవకాశవాదులు తీవ్రంగా శ్రమిస్తున్నారని బీఆర్ఎస్​నుద్దేశించి వ్యాఖ్యానించారు. రాజకీయ కక్షతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన చేస్తామని గత ప్రభుత్వం కూడా చెప్పిందని, కానీ చేయలేదని అన్నారు. తమ  ప్రభుత్వం ఆ పనిచేస్తుంటే బీఆర్ఎస్ ఇప్పుడు అడ్డంకులు సృష్టిస్తున్నదని ఫైర్​అయ్యారు. “పేదలను పడగొట్టాలన్నది కాదు.. నిలబెట్టాలన్నదే మా ఉద్దేశం. మూసీ నిర్వాసితులందరికీ డబుల్ బెడ్ రూమ్స్ ఇస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. ‘‘కొంతమందికి అధికారులు అందజేశారు. సొంత ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తం. కొంత మంది పేదలు తెలిసో తెలియకో మూసీ ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించుకొని ఉంటున్నరు” అని శ్రీధర్​బాబు పేర్కొన్నారు. మూసీ రివర్​బెడ్​లో ఉన్న  అక్రమ నిర్మాణాలను మాత్రమే తొలగిస్తున్నామని చెప్పారు. నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. నిర్వాసితుల పిల్లల కోసం అంగన్ వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఆరేండ్లపాటు చదివిస్తామని చెప్పారు.  స్వయం సహాయక మహిళా గ్రూపులతో వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. పునరావాసం కోసం హైలెవల్ కమిటీ పనిచేస్తున్నదని చెప్పారు. రివర్ బెడ్ లో గుర్తించే నివాసాలకు కూడా భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం చెల్లిస్తామని తెలిపారు.

బీఆర్ఎస్​ బుల్డోజర్ పాలసీని అమలుచేసింది.. 

మూసీ నిర్వాసితులపై బీఆర్ఎస్ మొసలి కన్నీళ్లు కారుస్తున్నదని మంత్రి శ్రీధర్​బాబు విమర్శించారు. ఈ అంశాన్ని భూతద్దంలో పెట్టి  చూపించే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.  మల్లన్నసాగర్ భూనిర్వాసితుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసని, మల్లన్నసాగర్ బాధిత రైతు మల్లారెడ్డి  చితిపెట్టుకొని ఆహుతయ్యాడని గుర్తు చేశారు. భూనిర్వాసితుల చట్టం–2013ను అమలు చేయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జీవో తీసుకువచ్చిందని, మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల విషయంలో హైకోర్టు అనేక సార్లు మొట్టికాయలు కూడా వేసిందని అన్నారు.  భూ నిర్వాసితులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్​కు లేదని ఫైర్ అయ్యారు. మల్లన్న సాగర్ నిర్వాసితుల పైకి, రైతు సోదరుల పైకి బుల్డోజర్లు పంపించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని  శ్రీధర్ బాబు అన్నారు. అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నాయో.. అక్కడికే మా బుల్డోజర్లు వెళ్తున్నాయని చెప్పారు.

‘‘మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల కోసం మా దామోదర రాజనర్సింహ పోరాటం చేశారు. భూ నిర్వాసితులను కలిసేందుకు గత ప్రభుత్వంలో ఉత్తమ్, భట్టి, రేవంత్ వెళ్తుంటే వారిని వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. కానీ.. ప్రజాపాలనలో ప్రతిపక్షం ఎక్కడికి వెళ్లినా అనుమతులు  ఇస్తున్నం. ప్రతిపక్షాలను పోలీసులతో అడ్డుకోవడం లేదు” అని తెలిపారు. తాము ప్రజాస్వామ్య స్ఫూర్తితో వెళ్తుంటే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బులిచ్చి సీఎంతోపాటు  ప్రభుత్వంపైన వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారని అన్నారు.  అరాచక శక్తులను బీఆర్ఎస్  ప్రోత్సహిస్తున్నదని,  ఇది అసలు రాజకీయం కాదని పేర్కొన్నారు.  

హైడ్రా విషయంలో పేదలకు ఆందోళన వద్దు

హైడ్రా విషయంలో పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని మంత్రి శ్రీధర్​బాబు భరోసా ఇచ్చారు. బిల్డర్ల చేతిలో మోసపోయిన పేదలు, మధ్యతరగతి వారి నివాసాల విషయంలో ప్రభుత్వం తొందరపడదని, ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. ఎవరికీ అన్యాయం జరగొద్దనే ప్రభుత్వం భావిస్తున్నదని తెలిపారు.  హైడ్రా, మూసీ ప్రక్షాళనపై ప్రతి జిల్లాలో హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ప్రజలకు ఎలాంటి సందేహాలు వచ్చినా.. హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. మూసీ, హైడ్రాపైన చట్టబద్ధంగా, ప్రణాళికాయుతంగా ముందుకువెళ్తామని స్పష్టం చేశారు. హైడ్రా విషయంలో ఎవరైనా ఒక్కటేనని, సీఎం రేవంత్ రెడ్డి అన్న కు కూడా నోటీసులు ఇచ్చారని, తన ఇల్లు అక్రమమైతే కూల్చాలని ఆయన స్వయంగా చెప్పాడని మంత్రి గుర్తు చేశారు. అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు ఉంటాయని, అన్నింటిపైన విచారణ జరుగుతుందని చెప్పారు. ఎవరిపైనా వ్యక్తిగత కక్షలుండవని స్పష్టం చేశారు.

అపార్ట్​మెంట్ నిర్వాసితులకు ఏ రకంగా న్యాయం చేయాలన్నదానిపై సీఎం ఆలోచిస్తున్నారని,  బిల్డర్ల చేతిలో మోసపోయిన వారి విషయంలో మానవీయ దృక్పథంతో వ్యవహరిస్తామని చెప్పారు. 1920 లో కూడా మూసీ పైన కట్టడాలు తొలగించి.. ప్రత్యామ్నాయం చూపించారని,  రాష్ట్రానికే గ్రోత్ ఇంజిన్ ఇవ్వాలన్న ఉద్దేశం తోనే మూసీ ప్రక్షాళన చేపడుతున్నామన్నారు.  ‘‘హైదరాబాద్ వాసులు మురికికంపుతో ఉండాలా? మూసీ నదిలో నివాసం ఏర్పరుచుకున్న వారికి ప్రభుత్వం అండగా ఉండాలా? వద్దా? అక్రమ నిర్మాణాలను చూస్తూ ఊరుకోవాలా? అని మంత్రి శ్రీధర్​బాబు ప్రశ్నించారు.

ప్రపంచంలోనే బెస్ట్​ సిటీగా హైదరాబాద్​

హైదరాబాద్ కు గోదావరి జలాలను తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు. ఇప్పుడు మూసీని సుందరీకరించి అందులో గోదావరి నీటిని ప్రవహింపజేస్తామని చెప్పారు.  ‘‘మూసీ మాస్టర్ ప్లాన్ బ్లూ ప్రింట్ తయారు చేశాం. ఇంకా డీపీఆర్ రెడీ కాలేదు. అప్పుడే లక్షన్నర కోట్లతో మూసీ అభివృద్ధా? అని బీఆర్ఎస్ వాళ్లు విమర్శలు చేస్తున్నరు. పారదర్శకంగా మూసీ రివర్​ ఫ్రంట్​ పనులు చేస్తం. పనుల కోసం అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న సంస్థలనే ఆహ్వానిస్తున్నం.ఈస్ట్, వెస్ట్ సైడ్​లో రోడ్లు వేస్తం. మూసీ పైన ఫ్లై ఓవర్లు నిర్మిస్తం. పీపీపీ మోడల్​లో నిర్మాణాలు ఉంటాయి. ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా హైదరాబాద్​ను తీర్చిదిద్దుతం. 35 టీంలతో సోషియో ఎకనమిక్ సర్వే చేస్తున్నం. వాక్ టు వర్క్ పద్ధతిలో ఉపాధి కల్పిస్తం. పేద, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయం చూపిస్తున్నం. 12 ఎన్జీవోల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నం”  అని వివరించారు.