జనగామ అర్బన్, వెలుగు : వాట్సప్‌కు వచ్చిన ఓ మెసేజ్‌ను ఓపెన్ చేయడంతో రూ. 11 లక్షలు నష్టపోయాడు ఓ కండక్టర్. జనగామ పట్టణానికి పోలోజు రామేశ్వర్ స్థానిక టీజీఎస్‌ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం 4 గంటలకు అతడి వాట్సప్‌కు యూనియన్ బ్యాంక్ పేరుతో ఓ ఏపీకే ఫైల్ వచ్చింది. అది బ్యాంక్ నుంచే వచ్చిందని అనుకున్న రామేశ్వర్ లింక్‌పై క్లిక్ చేసి ఫైల్‌ను ఓపెన్ చేశాడు.
శుక్రవారం ఉదయం తన అకౌంట్‌లో బ్యాలెన్స్ చెక్ చేసుకోగా రూ. 11.21 లక్షలు కనిపించలేదు. దీంతో వెంటనే యూనియన్ బ్యాంక్‌కు వెళ్లి స్టేట్‌మెంట్ తీసుకొని చూడగా గురువారం సాయంత్రం రూ. 7 లక్షలు, శుక్రవారం ఉదయం రూ. 4.21 లక్షలు డ్రా అయినట్లు గుర్తించాడు. తమిళనాడు రాష్ట్రంలోని సిద్దాపూర్ సెంట్రల్ బ్యాంక్‌లో అకౌంట్ హోల్డర్లు అయిన రాజు, రాహుల్ అనే వ్యక్తుల అకౌంట్లకు రూ. 2 లక్షలు ట్రాన్స్‌ఫర్ అయినట్లు స్టేట్‌మెంట్‌లో తేలింది.
వెంటనే స్థానిక పోలీసులకు, సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశాడు. వాట్సప్‌కు వచ్చిన ఏపీకే ఫైల్‌ను ఓపెన్ చేసిన తర్వాత తన ఫోన్ నంబర్ పనిచేయడం మానేసిందని బాధితుడు రామేశ్వర్ తెలిపాడు.