- ప్రధాని మోదీ ఫొటోకు బీజేపీ నేతల పాలాభిషేకం
హైదరాబాద్/బడంగ్ పేట/మహేశ్వరం/షాద్ నగర్, వెలుగు : కేంద్రం గ్యాస్ సిలిండర్ ధర తగ్గించడంతో బుధవారం గ్రేటర్ వ్యాప్తంగా బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ .. ప్రధాని మోదీ ఫొటోకు పాలాభిషేకం చేశారు. సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆధ్వర్యంలో బల్దియా సర్కిల్ ఆఫీసు ఆవరణలో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఫొటోకు పాలాభిషేకం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని 33 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు.
బీజేపీ మహేశ్వరం సెగ్మెంట్ ఇన్ చార్జి అందెల శ్రీరాములు ఆధ్వర్యంలో నేతలు బడంగ్ పేట చౌరస్తాలో మోదీ ఫొటోకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్ ధర కొంచెం పెరిగితే నానా యాగీ చేసి కట్టెలు మోసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇప్పుడు ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ గ్యాస్ బండ మోయాలన్నారు. షాద్ నగర్ చౌరస్తాలో బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నారు.