తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి ఓటమి పాలవ్వడంతో సీఎం కేసీఆర్( KCR) రాజీనామా అనివార్యమైంది. దీంతో ఆయన తన రాజీనామా లేఖను తన ఓఎస్డి ద్వారా గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ కి పంపి అక్కడి నుంచి ఫామ్ హౌస్ కు వెళ్లారు
సీఎం కేసీఆర్ ఎప్పుడూ ఆర్భాటంగా కాన్వాయ్‌తో బయలుదేరేటప్పుడు ముందుగా అక్కడున్న పోలీసులకు సమాచారమిచ్చి బయలుదేరేవారు. అవసరమైతే తాను ఎందుకు వెళుతున్నానో మీడియాకు కూడా లీకులు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు కనీసం మొహం చూపించకుండా ఎలాంటి ఆర్భాటం లేకుండా.. కనీసం అక్కడున్న పోలీసులకు కూడాసమాచారం ఇవ్వకుండా స్వంత వాహనంలో వెళ్లి ఓఎస్డీకు సమర్పించారు. ఆ తరువాత కూడా ఎవరికి తెలియకుండా తన ఫామ్ హౌస్‌కు వెళ్లారు. కేసీఆర్ వాహనం వెంట మరొక వాహనం మాత్రమే ఉందని తెలుస్తోంది.
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ప్రగతి భవన్ కి వచ్చిన కేసీఆర్ ఫలితాలు కాంగ్రెస్ కి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో రాజీనామా చేసి రాజభవన్ కి వెళ్లకుండా నేరుగా ఫామ్ హౌస్ కి వెళ్లిపోయారు. ఈ ఎన్నికల్లో కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో కేసీఆర్ పోటీ చేయగా..కామారెడ్డిలో ఓడిపోయి గజ్వేల్ లో గెలుపొందారు. 2014 జూన్ 2 నుంచి 2023 డిసెంబర్ 3 వరకు ఆయన సీఎం గా కొనసాగారు. సుమారు తొమ్మిదేళ్లపాటు ఆయన ముఖ్యమంత్రిగా సేవలందించారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న జరగ్గా డిసెంబర్ 3 ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. 64 స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ చేసుకుంది.