7 కోట్లతో కడితే.. 7 నెలలకే కుంగింది

  • నాసిరకం పనులతో అరఫీటు మేర కుంగిన ర్యాంప్‌‌‌‌‌‌‌‌
  • క్వాలిటీ పాటించడం లేదంటూ నిర్మాణ టైంలోనే గ్రామస్తుల ఆందోళన
  • పట్టించుకోని ఆఫీసర్లు

శాయంపేట, వెలుగు : కోట్లాది రూపాయలు ఖర్చు చేసి బ్రిడ్జి కడితే ప్రారంభమై ఏడు నెలలు కూడా కాకముందే ర్యాంప్‌‌‌‌‌‌‌‌ అర ఫీటు మేర కుంగిపోయింది. కాంట్రాక్టర్ క్వాలిటీ పాటించడం లేదంటూ గ్రామస్తులు నిర్మాణ టైంలోనే ఆందోళనలు చేసినా ఆఫీసర్లు చూసీచూడనట్లు వదిలేశారు. దీంతో ప్రస్తుతం బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో భారీ వాహనాలు వెళ్తే ర్యాంప్‌‌‌‌‌‌‌‌ పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

రూ. 7 కోట్లతో నిర్మాణం

హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామ శివారు ఉన్న చలివాగు ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ మత్తడి పోసే టైంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేవి. దీంతో మత్తడిపై బ్రిడ్జి నిర్మాణానికి 2018లో ప్రభుత్వం రూ. 7 కోట్లు మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ సుమారు ఐదేళ్ల పాటు సాగదీసి 2023లో పనులు పూర్తి చేశారు. అదే టైంలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో అప్పటి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్‌‌‌‌‌‌‌‌ జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ గండ్ర జ్యోతి కలిసి 2023 జూలై 9న ఆగమేఘాల మీద బ్రిడ్జిని ప్రారంభించారు.

క్వాలిటీ లేదంటూ గతంలోనే ఆందోళనలు

బ్రిడ్జి పనులు చేసే కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ క్వాలిటీ పాటించడం లేదంటూ నిర్మాణ టైంలోనే కొప్పుల గ్రామస్తులు, వాహనదారులు కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ను నిలదీశారు. పలుమార్లు ఆందోళనలు సైతం నిర్వహించారు. అయినా ఆఫీసర్లు పట్టించుకోలేదు. దీంతో కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ ఇష్టారాజ్యంగా, నాసిరకంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Also Read : నీటి వాటాను ఆగం పట్టించి..పక్క రాష్ట్రానికి దోచిపెట్టారు

అరఫీటు మేర కుంగిన ర్యాంప్‌‌‌‌‌‌‌‌

బ్రిడ్జి నిర్మాణ టైంలో రోడ్డుపై నుంచి బ్రిడ్జిపైకి వేసిన ర్యాంప్‌‌‌‌‌‌‌‌లో మొరం నింపాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ తక్కువ ధరలో అయిపోతుందన్న ఉద్దేశంతో నల్లమట్టి నింపి దానిపై సీసీ వేశారు. ఇవేమీ పట్టించుకోని ఆఫీసర్లు పనులను నామమాత్రంగా పరిశీలించి కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌కు బిల్లులు చెల్లించేశారు. బ్రిడ్జి ప్రస్తుతం అరఫీట్‌‌‌‌‌‌‌‌ మేర కుంగి ప్రమాదకరంగా మారింది. ముందు ముందు భారీ వాహనాలు వెళ్తే ర్యాంప్‌‌‌‌‌‌‌‌ పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్లు స్పందించి ర్యాంప్‌‌‌‌‌‌‌‌ను సరిచేయడంతో పాటు, కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.