మహారాష్ట్రలో వింత ఆరోగ్య సమస్య..నిన్నటి వరకు ఉన్నట్టుండి బట్టతల..ఇప్పుడు గోళ్లు ఊడుతున్నాయ్

మహారాష్ట్రలో వింత ఆరోగ్య సమస్య..నిన్నటి వరకు ఉన్నట్టుండి బట్టతల..ఇప్పుడు గోళ్లు ఊడుతున్నాయ్

మహారాష్ట్ర ప్రజలు వింత ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారు. నాలుగు గ్రామాల ప్రజలు మొదట జుట్టు రాలి బట్టతల..ఇప్పుడు గోర్లు రాలిపోవడం సమస్యను ఎదుర్కొంటున్నారు. గ్రామం మొత్తంలో అందరికీ ఈ సమస్యరావడంతో ఆందోళన చెందుతున్నారు. కారణం ఏంటో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో  షెగావ్ పరిధిలోని పలు గ్రామాల్లో గతంలో ఎన్నడూలేని విధంగా జుట్టు రాలడం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు - నాలుగు గ్రామాలలో కనీసం 29 మందిలో గోర్లు రాలిపోయిన కేసులు నమోదు అయ్యాయి. మూడు నెలల క్రితం ఇదే గ్రామాల్లో ప్రజలకు జుట్టు రాలిపోయి బట్టతలలు ఏర్పడ్డాయి. కారణం తెలియని ఈ వింత సమస్య ఉండగానే సరిగ్గా నెల రోజుల తర్వాత మరో వింత సమస్య వచ్చి పడింది. 

షెగావ్ తాలూకాలోని నాలుగు గ్రామాల్లో 29మందికి గోర్లు ఊడిపోయాయి. కొందరిలో గోర్లలో పగుళ్లు ఏర్పడ్డాయి. అంతకుముందు ఇదే గ్రామాల్లో 200మందికి పైగా అకస్మాత్తుగా జుట్టు రాలిపోయే బోడిగుండు అయిన ట్లు బాధితులు, అధికారులు చెబుతున్నారు.  తాజాగా ఉన్నట్టుంది గోర్లు ఊడిపోవడం చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ వింత సమస్య ఎదుర్కొంటున్న బాధితులను షెగావ్‌లోని ఆసుపత్రికి తరలించామని అని బుల్ధానా ఆరోగ్య అధికారి డాక్టర్ అనిల్ బంకర్ తెలిపారు.

ఈ సమస్యకు కారణం ఏంటంటే.. 

అయితే షెగావ్ పరిధిలోని గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఈ వింత ఆరోగ్య సమస్యలకు కారణం ఏంటో తెలియక వైద్యాధికారులు తలలు పట్టుకున్నారు. హుటాహుటిన ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించి శాంపిల్స్ సేకరించి అధ్యయనం చేస్తే స్థానికులు తినే గోధుమలలో ఉన్న విషపూరిత కారకాలు అని తేలింది. 
ఈ వింత ఆరోగ్య సమస్యకారణం అస్పష్టంగానే ఉన్నప్పటికీ నేల, నీరు ,కొన్ని ఆహారాలలో లభించే సెలీనియం అనే ఖనిజ స్థాయిలు పెరగడమే దీనికి కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. గతంలో జుట్టు రాలడాన్ని అనుభవించిన వ్యక్తులు ఇప్పుడు గోళ్ల సమస్యలతో కూడా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 

డిసెంబర్ 2024 నుంచి జనవరి 2025 మధ్య బుల్ధానాలోని 18 గ్రామాల నుండి మొత్తం 279 మంది నివాసితులు అకస్మాత్తుగా జుట్టు రాలడం, బట్టతల రావడం అనే వింత సమస్యను ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని అక్యూట్ ఆన్సెట్ అలోపేసియా టోటాలిస్‌గా గుర్తించారు.బుల్ధానా ప్రజలు తినే గోధుమలలో సెలీనియం అధిక కంటెంట్ కారణంగా వారి ఆరోగ్య సమస్యలు కారణమని తేల్చారు.