సీజ్ ద ప్రాపర్టీ..మొండి పన్ను బకాయిలపై జీహెచ్ఎంసీ కొరడా

సీజ్ ద ప్రాపర్టీ..మొండి పన్ను బకాయిలపై జీహెచ్ఎంసీ కొరడా
  • 5 లక్షలకు పైన బకాయిలపై స్పెషల్ ఫోకస్
  • ఒక్కో ప్రాపర్టీ నుంచి రూ.52 కోట్ల దాకా పెండింగ్
  • నోటీసులకు స్పందించకుంటే ప్రాపర్టీ సీజ్

హైదరాబాద్ సిటీ, వెలుగు : ఏండ్ల తరబడి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండా సతాయిస్తున్న బకాయిదారులపై జీహెచ్ఎంసీ ‘సీజ్’ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నది. మార్చి 31తో ఫైనాన్షియల్​ ఇయర్​ముగియనుండడంతో జనవరి నుంచే రంగంలోకి దిగిన అధికారులు.. ఇప్పటి వరకు 6 లక్షల ప్రాపర్టీదారులకు నోటీసులు జారీ చేశారు. స్పందించని వారికి ఈనెల 18 నుంచి సీల్​వారంట్(సీజ్) నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రధానంగా ప్రైవేట్  కమర్షియల్ ప్రాపర్టీలకు సీల్ వారంట్ జారీ చేసి పన్నులు రాబడుతున్నారు.

ప్రస్తుతం జీహెచ్ఎంసీకి రూ.11,668 కోట్ల ప్రాపర్టీ టాక్స్​రావాల్సి ఉంది. ఇందులో 4 వేల ఆస్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ట్యాక్స్ బకాయిలే ఏకంగా రూ.5 వేల కోట్లు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కు చెందిన 600 ప్రాపర్టీలకు సంబంధించి రూ.500 కోట్లు ఉన్నాయి. ఇవి పోగా మిగిలిన రూ.6 వేల కోట్ల బకాయిలు ప్రైవేట్​సంస్థలు, వ్యక్తుల నుంచి రావాల్సి ఉంది. 

ఖైరతాబాద్​ జోన్​లోనే రూ.860 కోట్లు 

గ్రేటర్ లో మొత్తం 19.5 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. వీరిలో రెండున్నర లక్షల మంది కమర్షియల్, 17 లక్షల మంది రెసిడెన్షియల్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. అయితే 6 లక్షల మంది నుంచి రూ.5 లక్షలకుపైగా రావాల్సి ఉంది. జూబ్లీహిల్స్ లాండ్ మార్క్ ప్రాజెక్ట్ బకాయి రూ.52 కోట్లు, హెచ్ఎండీఏ ల్యాండ్ ని లీజుకి తీసుకున్న డాక్టర్ కార్ ప్రైవేట్ లిమిటెడ్  సంస్థ రూ.41 కోట్లు, హైదరాబాద్  ఆస్బెస్టాస్  సంస్థ బకాయి రూ.30 కోట్లు, ఎల్ అండ్ టీ మెట్రో రైల్  బకాయిలు రూ.32 కోట్లు, క్రిపాదేవి  అండ్  అదర్స్  సంస్థ బకాయిలు రూ.12 కోట్లు, సోమాజిగూడలోని కత్రియా హోటల్  బకాయిలు రూ.8.62 కోట్లు, ఇండో అరబ్ లీగ్  బకాయిలు రూ.7.33 కోట్లు ఇలా వందలాది మంది కోట్లల్లో బకాయిలు చెల్లించాల్సి ఉంది.

గ్రేటర్ లో ఆరు జోన్లు ఉండగా ఒక్క ఖైరతాబాద్ జోన్ లోనే అత్యధికంగా రూ.860 కోట్లకు ట్యాక్స్​పెండింగ్​ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.1,490 కోట్ల పన్నులు వసూలయ్యాయి. ఈనెల 18 నుంచి వారంట్లు జారీ చేస్తున్నారు. ఈ నాలుగు రోజుల్లోనే రూ.3 కోట్లకి పైగా వసూలైంది. మరోవైపు ఆస్తిపన్ను సమస్యల పరిష్కారం కోసం జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం(పీటీపీ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. 

మార్చి 29 వరకు ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1  గంటల వరకు అన్ని సర్కిల్ ఆఫీసుల్లో నిర్వహించనున్నారు. బిల్ కలెక్టర్ల ద్వారా, ఆర్టీజీఎస్  ద్వారా చెల్లింపుల నమోదు, ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్  బకాయిలు సరిచేయడం, కోర్టు కేసుల పరిష్కారం, ఐజీఆర్ఎస్​ సమస్యలు, ఆస్తిపన్ను చెల్లింపుల్లో ఇతర సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.