
ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ జారీ చేసిన 1919 ఫర్మానా తర్వాత అక్కడక్కడ నాన్‌ముల్కీలను స్థానిక ఉద్యోగాల్లో నియమించారు. 1920లో ముల్కీ ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ ఏర్పాటైంది. అనంతరం 1926లో లండన్‌లో విద్యను అభ్యసిస్తున్న హైదరాబాద్ విద్యార్థులు ది సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ అనే సంస్థను స్థాపించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన విద్యార్థులు చదువును ముగించుకున్న తర్వాత ఉద్యోగాలకు ప్రయత్నించగా ప్రభుత్వం నాన్ ముల్కీలను మాత్రమే ఉద్యోగాల్లో నియమించడంతో ఉద్యోగాలు లేకుండా పోయాయి. దీంతో ముల్కీలైన విద్యార్థులకు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగి మళ్లీ ముల్కీ ఉద్యమానికి దారితీసింది. వీటికితోడుగా 1930లో పంజాబ్ ప్రాంతానికి చెందిన ఖాన్ సాహెబ్‌లు హైదరాబాద్ సంస్థానానికి వచ్చి అనేక ఉన్నత ఉద్యోగాల్లో చేరారు. దీంతో స్థానికుల పదోన్నతులు దెబ్బతిని మళ్లీ ముల్కీ ఉద్యమం బలంగా బయలుదేరింది.
రాజ్యాంగ సంస్కరణల కమిటీ
1937లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ రాజ్యంలోని రాజ్యాంగ సంస్కరణల నిమిత్తం అరవముదు అయ్యంగార్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 1938లో అనేక రాజ్యాంగ సంస్కరణలను సూచిస్తూ తన నివేదికను సమర్పించింది. ఈ కమిటీ నివేదికలో ఉద్యోగాలకు సంబంధించి స్థానికులకే అధిక ప్రాధాన్యం ఇవ్వడానికి ఇప్పటివరకు జారీ చేసిన ఫర్మానాలను చిత్తుశుద్ధితో అమలు చేయాలని సూచించింది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి ప్రత్యేకమైన యంత్రాంగాన్ని రూపొందించాలని తెలిపింది. ఈ కమిటీ సూచనల ఆధారంగా 1919 ఫర్మానాలోని ఆర్టికల్ 39ను 1945 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేశారు.
నిజాం ముల్కీ లీగ్
ముల్కీల హక్కులు కాపాడటం, పౌరసత్వపు హక్కులు సంపాదించడానికి ప్రజలతో ఎన్నుకోబడిన శాసనసభకు జవాబుదారీ వహించే రాజకీయ సంస్కరణలు సాధించడానికి ఒక ప్రజా సంస్థ అవసరమని భావించి నిజాం ప్రజల సంఘం లేదా నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అనే సంస్థను స్థాపించారు. దీనినే ఉర్దూలో జమీయత్ రిఫాయామే నిజాం అంటారు. ఈ సంస్థను 1934లో నిజాం ప్రజల సంఘాన్ని స్థాపించారు. ఈ సంఘం హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే నినాదం ఇచ్చింది. దీని అధ్యక్షులు నవాబ్ సర్ నిజామత్ జంగ్. సర్ నిజామత్ జంగ్ నిజాం మంత్రి మండలిలో రాజకీయ శాఖ మంత్రిగా పనిచేసి 1930లో పదవి నుంచి తప్పుకున్నారు.
ఉపాధ్యక్షులు : డాక్టర్ లతీఫ్ సయిద్, రామచంద్రా నాయక్, కార్యదర్శులు: సయిద్ ఆబిద్ హసన్, బూర్గుల రామకృష్ణారావు, శ్రీనివాస శర్మ, కార్యదర్శి: బారిస్టర్ నౌషీర్ చీనాయ్, కార్యవర్గ సభ్యులు: ఈ సంస్థ 18 మంది సభ్యులతో కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.
రాజ బహదూర్ వెంకట్రామిరెడ్డి, నవాబ్ షంషీర్ జంగ్, వామన్ నాయక్, అక్బర్ అలీఖాన్, కాశీనాథరావు వైద్య, మాడపాటి హనుమంతరావు, అబుల్ హసన్ సయ్ద్ అలీ, గోపాలరావు వకీలు, వి.వి.జోషి, శంకరరావు బోర్గాంకర్, జనార్దన్‌రావు దేశాయి, అహమద్ మెహ్యద్దీన్, ఖలీలుజ్జమా, మందుముల నరసింగరావు, మీర్ హసనొద్దీన్, శ్రీపతిరావు పల్ నిట్కర్, నవాబ్ మొయిన్ యార్ జంగ్, నవాబ్ బహదూర్ యార్ జంగ్.
సంస్థ ఉద్దేశాలు
* నిజాం సంస్థానంలోని అనేక కులాల, వర్గాలతో కూడిన ప్రజల్లో స్నేహభావాలను పెంపొందించి ఒకరినొకరు సహకరించుకోవాలనేటట్లు ప్రయత్నించడం
* దేశీయ హక్కులను కాపాడటం, ఆ హక్కుల వల్ల ఉత్పన్నమైన బాధ్యతల గురించి తెలియజేయడం
* ప్రభుత్వం శాసనసభకు బాధ్యత వహించే రాజ్యాంగ స్థాపనకు ప్రయత్నించడం
* హైదరాబాద్ రాష్ట్రపు రాజరిక హక్కులను కాపాడటానికి ప్రయత్నించడం
* భారతదేశపు రాజ్యాంగ సమస్యకు పరిష్కార మార్గం, సమాఖ్య సంవిధానం ఒక్కటేనని ఈ సంస్థ విశ్వసిస్తుంది.
* హైదరాబాద్ రాష్ట్రం అవసరమైన రక్షణతో సమాఖ్యలో చేరి భారతదేశపు ప్రభుత్వం బాధ్యత నెరవేర్చడంలో పాలుపంచుకుంది.
* అఖండ భారతదేశం సంక్షేమానికి తప్ప మరేదానికి కూడా త్యాగం చేయడానికి రాజీపడకూడదని ఈ సంస్థ విధానం విశదీకరిస్తుంది.
నిజాం జన కేంద్ర సంఘం
నిజాం రాష్ట్ర జనసంఘం స్ఫూర్తితో తెలంగాణలో అనేక సంస్థలు ఏర్పాటయ్యాయి. ఈ సంస్థలన్నింటిని కలిపి 1923 ఏప్రిల్ 1న హన్మకొండలో నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘం ఏర్పాటు చేశారు. ఈ సంఘానికి రాజగోపాల్ రెడ్డి అధ్యక్షుడు. మాడపాటి హనుమంతరావు కార్యదర్శిగా వ్యవహరించారు. ఈ సంఘం ఆంధ్ర మహాసభ అవతరణ వరకు తెలంగాణ సాంస్కృతిక, వైజ్ఞానిక పురోభివృద్ధికి కృషి చేసింది. దీనికి అనుబంధంగా ఆదిరాజు వీరభద్రరావు సారథ్యంలో ఆంధ్ర పరిశోధక సంఘం స్థాపించారు. కొమ్మరాజు లక్ష్మణరావు మరణానంతరం ఈ సంఘం లక్ష్మీనారాయణ పరిశోధక మండలిగా మారింది. వర్తక స్వేచ్ఛ, వెట్టి చాకిరి, మోతుర్భా మగ్గం పన్ను అనే కరపత్రాలు, నిజాం రాష్ట్ర ఆంధ్రులు, నిజామాంధ్ర రాష్ట్ర ప్రశంస, నిజాం రాష్ట్ర అభివృద్ధి మార్గాలు అనే లఘు పుస్తకాలు ప్రచురించింది. 1930లో వరంగల్‌లో కాకతీయుల చర్చాగోష్టి పేరుతో నిర్వహించిన సభ అనంతరం వరంగల్ నుంచి కాకతీయ సంచిక వెలువడింది.