- కౌంటింగ్ కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో 144 సెక్షన్
- ఎన్నికల కౌంటింగ్‌కు భారీ భద్రత
వరంగల్/ములుగు/నర్సంపేట/వర్ధన్నపేట, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రాలతో పాటు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు కంటే ఎక్కువ మంది గుమికూడినా, ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత పటాకులు కాల్చడం, విజయోత్సవ ర్యాలీలు తీసేందుకు పర్మిషన్ లేదన్నారు. కౌంటింగ్ మరుసటి రోజు పర్మిషన్ తీసుకున్న తర్వాతే విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకోవాలని సూచించారు.
మూడంచెల భద్రత
జనగామ జిల్లా కేంద్రం శివారులోని పెంబర్తి వీబీఐటీ కాలేజీ కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం చెప్పారు. జనగామలోని తన ఛాంబర్‌లో శనివారం మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాల నిఘాతో పాటు, కేంద్ర, ఏఆర్ బలగాలు, సివిల్ ఫోర్స్ బందోబస్తు నిర్వహిస్తుందని చెప్పారు. రిటర్నింగ్ ఆఫీసర్లు జారీ చేసిన ఐడీ కార్డులు ఉన్న ఏజెంట్లనే కౌంటింగ్ హాల్‌లోకి పంపిస్తామని చెప్పారు.
సెల్‌ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, వాటర్ బాటిల్స్‌ను తీసుకెళ్లొద్దని సూచించారు. కౌంటింగ్ కేంద్రం పరిసరాలతో పాటుగా, జనగామ టౌన్, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, డీసీపీ వెంట టౌన్ సీఐ ఎలబోయిన శ్రీనివాస్ ఉన్నారు. అనంతరం ఏసీపీ కొత్త దేవేందర్‌రెడ్డితో కలిసి కౌంటింగ్ సెంటర్‌ను పరిశీలించారు.