ప్రధాని వెళ్లిన తర్వాత తిరిగి హైదరాబాద్ కు సీఎం కేసీఆర్

బెంగళూరు పర్యటనకు వెళ్లారు సీఎం కేసీఆర్. అక్కడ మాజీ ప్రధాని దేవెగౌడ, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12.30 కు బెంగళూరులోని పద్మనాభ నగర్ లో మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి చేరుకుంటారు. అక్కడ దేవెగౌడ, కుమారస్వామితో కలిసి లంచ్ చేస్తారు. తర్వాత దేశంలో రాజకీయ పరిస్థితులు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల పట్ల అనుసరిస్తున్న విధానాలు, ఇతర అంశాలపై చర్చిస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.

మధ్యాహ్నం 3 గంటలకు దేవెగౌడ నివాసం నుంచి బయల్దేరి 3.45 కు బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు సీఎం కేసీఆర్. సాయంత్రం 4 గంటలకు అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ లో బయల్దేరి సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. కేసీఆర్ బెంగళూరు టూర్ నేపథ్యంలో ఆయన అభిమానులు దేవెగౌడ నివాసం దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ గురువారం రాత్రి బెంగళూరులో బస చేసి శుక్రవారం మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధికి వెళ్లి అన్నాహజారేతో భేటీ కావాల్సి ఉంది. కానీ ఇవాళ సాయంత్రమే ఆయన హైదరాబాద్ కు వస్తున్నారు. 

రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న టైమ్  లోనే సీఎం కేసీఆర్  బెంగళూరు వెళ్తున్నారు. ప్రధాని హైదరాబాద్  రావడానికి ముందే వెళ్లి, ఆయన ఢిల్లీకి బయల్దేరిన తర్వాత తిరిగి హైదరాబాద్  చేరుకునేలా సీఎం టూర్  షెడ్యూల్  ఉంది. మోడీ రాష్ట్ర టూర్ కు కేసీఆర్ దూరంగా ఉండటం ఇది మూడోసారి. దీనిపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రధాని మోడీకి స్వాగతం పలకాల్సి వస్తుందనే కేసీఆర్  రాష్ట్రంలో ఉండటం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రానికి మోడీ ఏం చేశారని స్వాగతం పలకాలని మంత్రులు, టీఆర్ ఎస్  నేతలు విమర్శిస్తున్నారు.   

రాష్ట్రంలో ప్రధాని మోడీ టూర్ లో సీఎం కేసీఆర్ పాల్గొనకపోవడం ఇది మూడోసారి. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న టైంలో వ్యాక్సిన్  తయారీ కోసం శ్రమిస్తున్న సైంటిస్టులను అభినందించేందుకు మోడీ.. హైదరాబాద్  జీనోమ్  వ్యాలీకి వచ్చారు. అప్పుడు హకీంపేట ఎయిర్  పోర్టులో ల్యాండ్  అయిన మోడీకి కేసీఆర్  స్వాగతం పలకలేదు. కొద్దిరోజుల క్రితం ముచ్చింతల్  లోని చినజీయర్  ఆశ్రమంలో సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకు ప్రధాని మోడీ వచ్చినప్పుడూ కేసీఆర్ వెళ్లలేదు. ప్రభుత్వం తరపున మంత్రి తలసానిని పంపించారు.  ప్రధాని మోడీ ISB పర్యటన షెడ్యూల్  ను ముందే రూపొందించారు. నిర్వాహకులు సీఎం కేసీఆర్  ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే ప్రధాని మోడీకి దూరంగా ఉంటూ వస్తున్న కేసీఆర్  ఈసారి కూడా ఆయనతో కలిసి వేదిక పంచుకోవడానికి ఇంట్రస్ట్ చూపించలేదు. అందుకే ఢిల్లీ, బెంగళూరు టూర్లను పెట్టుకున్నారనే విమర్శలున్నాయి.

మరిన్ని వార్తల కోసం

భారీగా పెరుగుతున్న వెహికల్స్

కేటీఆర్ ​ఆర్డరేసినా నెమ్మదిగానే అభివృద్ధి పనులు