హైదరాబాద్, వెలుగు: ఎంపీ ఎన్నికలు ముగిసిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో అధికార కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొంది. ఎంపీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఎంపీ ఎన్నికల్లో మంచి మెజార్టీ తెచ్చిన లోకల్ లీడర్లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రయారిటీ ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పలుసార్లు ప్రకటించారు. దీంతో లోకల్ లీడర్లు స్థానిక ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు.
గ్రామ పంచాయతీతోపాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ , మున్సిపల్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ లీడర్లు ఉత్సాహం చూపుతున్నారు. రిజర్వేషన్లు మారుతున్నాయని, ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని కొందరు తమ గ్రామ ప్రజలు, బంధువులు, సన్నిహితులకు చెప్తున్నారు. ఎన్నికల ఖర్చుకు సంబంధించి కూడా వనరులు సమీకరించే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు.. సుమారు 88 వేలకు పైగా వార్డులు ఉన్నాయి. 5,857 ఎంపీటీసీలు.. 539 జడ్పీటీసీలు ఉన్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలిపి 140కి పైగా ఉన్నాయి. వీటన్నిటికీ వరుస క్రమంలో ఎన్నికలు జరగనున్నాయి.
కులగణనతో మారనున్న రిజర్వేషన్లు!
గత బీఆర్ ఎస్ ప్రభుత్వం ఖరారు చేసిన పంచాయతీ రిజర్వేషన్లు 2 టర్మ్ లు అమల్లో ఉంటాయని పంచాయతీ రాజ్ యాక్ట్ లో పేర్కొన్నారు. ఇప్పటికే ఒక టర్మ్ అయిపోయింది. అయితే అధికారంలోకి వస్తే కుల గణన చేపడుతాయని, జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్లు ప్రకటిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక.. కులగణన కోసం కేబినెట్ లో నిర్ణయం తీసుకొని, రూ. 150 కోట్లు కేటాయించింది. ఎంపీ ఎన్నికల కోడ్ ముగియగానే కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కులగణనతో రిజర్వేషన్లు మారుతాయని అధికారులు చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగా లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు.
గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నరు
తెలంగాణ ఏర్పాటు తర్వాత 10 ఏండ్లకు కాంగ్రెస్ పార్టీ గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. పదేండ్ల నుంచి పార్టీ లోకల్ లీడర్లు అధికార పదవులకు దూరంగా ఉన్నారు. ఈ పదేండ్లలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వివిధ ఎన్నికల్లో చాలా చోట్ల లోకల్ లీడర్లు గెలిచినప్పటికీ అధికార బీఆర్ ఎస్ పార్టీ నేతల ఒత్తిడి వంటి కారణాలతో పలువురు బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఈసారి ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని వాళ్లంతా భావిస్తున్నారు. ఇందు కోసం గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.
సార్ పోటీ చేస్తం.. చాన్స్ ఇవ్వండి
ఈ ఏడాది ఫిబ్రవరి 1న గ్రామ పంచాయతీల టర్మ్ పూర్తి అయింది. లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. లోకల్ బాడీ ఎన్నికలపై సీఎం నుంచి ప్రకటన వచ్చినప్పటి నుంచీ.. ఎమ్మెల్యేలు, మంత్రులను కలుస్తూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ లోకల్ లీడర్లు కోరుతున్నారు. పదేండ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నామని చెప్తున్నారు. తమకు ఇవ్వడం కుదరకపోతే తమ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని అడుగుతున్నారు.