- తమ సెగ్మెంట్‌లో జనం తీర్పు ఎలా ఉండబోతుందోనని చర్చ
- పోలింగ్ ముగిసిన తర్వాత కనిపించని అభ్యర్థులు
- ఫోన్లు స్విచాఫ్.. సన్నిహితులతో మంతనాలు..
- ఎంత కష్టపడినా కలిసిరాలేదని కొందరు కన్నీళ్లు
- గెలుస్తామనే ధీమా వచ్చిన లీడర్లలో ఫుల్ జోష్
ఖమ్మం, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థులంతా లెక్కల్లో పడ్డారు. గెలుపోటములపై సన్నిహితులతో మంతనాలు చేస్తున్నారు. అనుకూల, ప్రతికూల ఓటింగ్‌పై చర్చిస్తున్నారు. తమ సెగ్మెంట్లలో జనం తీర్పు ఎలా ఉండబోతుందోనని టెన్షన్ పడుతున్నారు. ఎలక్షన్ ప్రాసెస్ మొదలైనప్పటి నుంచి ఓటర్లకు పంచేంత వరకు తాము చేసిన ఖర్చుల వివరాలను చూసుకుంటున్నారు. దాదాపు నెల రోజులపాటు తీరిక లేకుండా గడిపిన చాలా మంది అభ్యర్థులు గురువారం రాత్రి సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. కొందరు లీడర్లు మొబైల్ ఫోన్లు స్విచాఫ్ చేసుకుని.. తమ సన్నిహితులకు మాత్రమే టచ్‌లో ఉన్నారు. ఇక శుక్రవారం సన్నిహితులను ఇండ్లకు, ఆఫీసులకు పిలిపించుకొని.. ఓటింగ్ సరళిపై ఆరా తీశారు. ఎక్కడ అనుకూలంగా ఉంది? ఎక్కడ ప్రతికూలంగా మారింది? అనేది చర్చించి.. ఆదివారం రాబోయే ఫలితాలపై క్లారిటీ తెచ్చుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు.
ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, యూనియన్ల వారీగా ఆత్మీయ సమావేశాలను అభ్యర్థులు నిర్వహించారు. అపార్ట్‌మెంట్లు, డివిజన్ల వారీగా మీటింగ్‌లు పెట్టారు. ఆయా వర్గాలను బట్టి హామీల వర్షం కురిపించారు. ఇప్పుడు ఇవన్నీ ఎంత వరకు కలిసివచ్చాయి? కుల, ఉద్యోగ సంఘాలు, వివిధ యూనియన్ల నుంచి అనుకున్నట్టుగా బల్క్ఓట్లు పడ్డాయా? లేదా? అనే విషయాలు ఆరా తీస్తున్నారు.
ఏ గ్రామంలో ఎక్కువ ఓట్లు పడ్డాయి? ఏ గ్రామంలో వెనుకబడ్డాం? ఆయా చోట్ల ఏ లోపం జరిగింది? మండలాల వారీగా పరిస్థితి ఏంటి? ఇలా అన్ని కోణాల్లో చర్చిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న సెగ్మెంట్లలో ప్రతి అంశాన్ని లెక్కలోకి తీసుకుంటుండగా, కొన్ని సెగ్మంట్లలో మాత్రం ఓటింగ్ సరళిని పరిశీలించిన తర్వాత గెలుపోటములపై క్లారిటీకి వస్తున్నారు. ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోయిందంటూ కొందరు అభ్యర్థులు సన్నిహితులతో కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం.
ఒక్కో సెగ్మెంట్‌లో రూ.వంద కోట్లకు పైనే!
31 ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు, హైదరాబాద్‌లో ఎంఐఎం బలంగా ఉన్న 7 నియోజకవర్గాలను మినహాయిస్తే 70 నుంచి 80 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల ఎన్నికల ఖర్చు సగటున రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లు దాటినట్టు తెలుస్తున్నది. పలు ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు సెగ్మెంట్లలోనూ ఈ ఖర్చు రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల మధ్య ఉన్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ సెగ్మెంట్లలో ఓటర్లకు ఒక్కో అభ్యర్థి రూ.500 నుంచి రూ. వెయ్యి దాకా పంచితే.. జనరల్ సీట్లలో పోటీని బట్టి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు పంచిపెట్టారు. దక్షిణ తెలంగాణలోని ఒక జనరల్ సీటులో ఒక అభ్యర్థి.. లీడర్లు, ఓటర్ల పంపకాలకే రూ.100 కోట్ల వరకు ఖర్చు చేయగా, మిగిలిన ఖర్చు రూ.50 కోట్లు దాటినట్లు ప్రచారం జరుగుతున్నది.
ఈ నియోజకవర్గంలో ప్రత్యర్థి కూడా రూ.60 కోట్ల వరకు ఖర్చుపెట్టినట్టు సమాచారం. ప్రత్యర్థి పార్టీల నుంచి ముఖ్య నాయకులను తమ పార్టీలోకి తెచ్చుకునేందుకు, సొంత పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులను ఇతర పార్టీలోకి వెళ్లకుండా కాపాడుకునేందుకు ఆయా అభ్యర్థులు కోట్లాది రూపాయలను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు. సోషల్ మీడియా, మీడియా ప్రచారం ఖర్చుల దగ్గర్నుంచి రోడ్ షోలు, బహిరంగ సభల కోసం భారీగానే వెచ్చించారు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టింది? అందుకు తగినట్లుగా ఓట్ల రూపంలో ఫలితం వచ్చిందా? లేదా? అని లెక్కల్లో అభ్యర్థులు తలమునకలయ్యారు.