
- వరంగల్ బహిరంగ సభ దసరా తర్వాతే!
- అప్పటి నుంచే ప్రచారంలోకి కేసీఆర్
- ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో హరీశ్ భేటీ..
- మేనిఫెస్టో, ఇతర కీలక అంశాలపై చర్చ
- చెస్ట్ ఇన్ఫెక్షన్ నుంచి కాస్త కోలుకున్న సీఎం..
- రేపు కేబినెట్ మీటింగ్ పెట్టే చాన్స్
హైదరాబాద్, వెలుగు : మూడు వారాల తర్వాత సీఎం కేసీఆర్ మొదటిసారి పొలిటికల్ యాక్టివిటీలో పాలుపంచుకున్నారు. వైరల్ ఫీవర్, చెస్ట్ఇన్ఫెక్షన్ నుంచి కాస్త కోలుకున్న ఆయన.. ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. మొదట కేసీఆర్‌కు వైరల్ ఫీవర్వచ్చింది. న్యూమోనియా నుంచి కోలుకున్న తర్వాత చెస్ట్‌లో ఇన్ఫెక్షన్ అయినట్టు డాక్టర్లు గుర్తించి ట్రీట్ మెంట్ అందించారు. దాని నుంచి కేసీఆర్ దాదాపు కోలుకున్నట్టు సమాచారం. రెండు, మూడు రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వస్తుందనే సమాచారంతో మంత్రి హరీశ్‌రావును ప్రగతి భవన్‌కు పిలిపించి కేసీఆర్ మాట్లాడారు. సీఎం నుంచి ఫోన్ రావడంతో ఆదివారం ఉదయం గాంధీ హాస్పిటల్లో ఐవీఎఫ్సెంటర్ ప్రారంభించాల్సిన హరీశ్‌రావు.. అక్కడికి వెళ్లకుండానే ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హరీశ్ ప్రగతి భవన్‌లోనే ఉన్నారు. కేసీఆర్, హరీశ్‌రావు ఫేస్ టు ఫేస్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్టుగా ప్రగతి భవన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 16న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అనుకున్నప్పటికీ, దసరా తర్వాతే ఆ సభ పెట్టాలనే యోచనలో కేసీఆర్ఉన్నట్టు తెలిసింది. ఆ రోజు నుంచి తాను ఎన్నికల ప్రచారంలో రెగ్యులర్‌గా పాల్గొంటానని ఆయన చెప్పినట్టు సమాచారం. కాగా, శనివారం కామారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్కుజ్వరం రాగా.. ఆయన ఆదివారం ప్రగతి భవన్‌లోనే రెస్ట్ తీసుకున్నారు.ఈ క్రమంలో మధ్యాహ్నం కాసేపు కేసీఆర్, హరీశ్‌రావుతో సమావేశంలో పాల్గొన్నట్టు తెలిసింది.
ఎన్నికల అంశాలపై చర్చ..
ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై హరీశ్ రావుతో కేసీఆర్ చర్చించినట్టు తెలిసింది. కేటీఆర్, హరీశ్‌రావు నియోజకవర్గాల పర్యటనల్లో ప్రజల స్పందన, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది? ఫీల్డ్‌లో కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర పార్టీల పరిస్థితి ఏమిటి? బీఆర్ఎస్ను వీడి ఇతర పార్టీల్లో చేరిన లీడర్ల ప్రభావం ఎంత మేరకు ఉంటుందనే అంశాలపై హరీశ్‌ను కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. మల్కాజిగిరి, జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి స్థానాలకు అభ్యర్థుల ప్రకటనపైనా చర్చించినట్టు తెలిసింది. ప్రభుత్వం నుంచి ప్రజలు ఇంకా ఏం కోరుకుంటున్నారు? పార్టీ మేనిఫెస్టోలో ఇవ్వాల్సిన కీలక హామీలు ఏమిటీ? అనే అంశాలపైనా చర్చించినట్టు తెలుస్తోంది. ప్రగతి నివేదన సభల్లో ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టు చెప్తున్నా, దాన్ని మరింత ఎఫెక్టివ్‌గా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపైనా డిస్కస్ చేసినట్టు సమాచారం. కాగా, అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. ప్రచారంలోనూ పార్టీ క్యాండిడేట్లను పరుగులు పెట్టిస్తున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఇప్పటికే 60కి పైగా నియోజకవర్గాల్లో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్వచ్చేలోపే ఇంకో 10, 15 నియోజకవర్గాలను చుట్టేయాలని ఇద్దరు కీలక నేతలకు కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కేటీఆర్ జ్వరంతో ఆదివారం గద్వాల జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నా.. సోమవారం భూపాలపల్లి, వరంగల్ జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు.
ALSO READ :- బతుకమ్మకు చీరలు.. దసరాకు లిక్కర్
రేపు కేబినెట్ భేటీ?
ఎన్నికల షెడ్యూల్‌కు ముందు కేబినెట్ భేటీ నిర్వహించే అవకాశముందని ప్రగతి భవన్వర్గాలు చెబుతున్నాయి. గత వారమే మంత్రివర్గ సమావేశం నిర్వహించాల్సి ఉన్నా, కేసీఆర్ అనారోగ్యం కారణంగా వాయిదా వేశారు. బుధ లేదా గురువారాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్షెడ్యూల్ ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం కేబినెట్ సమావేశం నిర్వహించే చాన్స్ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భేటీలో ఎమ్మెల్సీలుగా కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ కుమార్ పేర్లకు ఆమోదం తెలుపుతూ మళ్లీ తీర్మానం చేసి గవర్నర్‌ఆమోదం కోసం పంపనున్నట్టు సమాచారం. ఇదివరకే వీరి పేర్లను కేబినెట్ సిఫార్సు చేయగా సోషల్ సర్వీస్ కేటగిరీలో వారిద్దరు ఫిట్కారని పేర్కొంటూ గవర్నర్ ఆ ప్రతిపాదనను తిప్పిపంపారు. దీంతో మరోసారి వారిద్దరి పేర్లు పంపి గవర్నర్ఆమోదించేలా రాజ్‌భవన్‌పై ఒత్తిడి పెంచే యోచనలో కేసీఆర్ ఉన్నారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలకు ఆమోదముద్ర వేసే అవకాశమున్నట్టు సమాచారం.