తిరుమల లడ్డూ వివాదం సమసిపోక ముందే ఇంతలో ఇదేంటి..?

తిరుమల లడ్డూ వివాదం సమసిపోక ముందే ఇంతలో ఇదేంటి..?

ముంబై: తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం సమసిపోక ముందే మరో దేవాలయ ప్రసాదం వార్తల్లో నిలిచింది. ముంబైలోని ప్రముఖ దేవాలయమైన సిద్ధివినాయక ఆలయ ప్రసాదానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. తాజాగా ఈ ఆలయ ప్రసాదానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో దుమారం రేగింది.

సిద్ధి వినాయక ఆలయ ప్రసాదం నిల్వ ఉంచిన బాక్సుల్లో, ప్రసాదం ప్యాకెట్లలో ఎలుక పిల్లలు ఉన్నట్టుగా నెట్టింట ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శ్రీ సిద్ధివినాయక్ గణపతి ఆలయ ట్రస్ట్ చైర్పర్సన్, శివసేన నేత సదా సర్వంకర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ వివరణ ఇచ్చారు. ఆలయ ప్రసాదంలో ఎలుక పిల్లలు కనిపించాయనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. స్వామి ప్రసాదాన్ని తయారుచేసే ప్రదేశం చాలా శుభ్రంగా ఉంటుందని చెప్పారు.

ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యి, జీడిపప్పు.. ఇలా అన్నింటినీ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ల్యాబ్కు పంపి, అనుమతి వచ్చిన తర్వాతే వినియోగించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రసాదం తయారీలో వినియోగించే నీళ్లు కూడా ల్యాబ్లో టెస్ట్ చేశాకే వినియోగిస్తున్నట్లు చెప్పారు. నాణ్యమైన ప్రసాదాన్ని భక్తులకు అందించే సదుద్దేశంతోనే ఇంత శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఇక.. వైరల్ అవుతున్న వీడియో విషయానికొస్తే.. ఆ వీడియో రెండు రోజుల నుంచి వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఏముంది..? ఆ వీడియో ఎక్కడ నుంచి వచ్చింది..? అనే విషయంపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. సిద్ధివినాయక ప్రసాదం తయారు చేసే ప్రదేశం చాలా శుభ్రంగా ఉంచుతున్నామని, ఈ వీడియో ఆలయ ప్రసాదం తయారీ ప్రదేశానికి సంబంధించినది కాదని శ్రీ సిద్ధివినాయక్ గణపతి ఆలయ ట్రస్ట్ చైర్పర్సన్ సదా సర్వంకర్ వివరణ ఇచ్చారు.

ALSO READ | నిజం ఏంటీ అంటే : తిరుమల లడ్డూ వివాదం.. ఇప్పుడు పాకిస్తాన్ వరకూ వెళ్లింది.. !

తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి ప్రసాదమైన లడ్డూ తయారీ.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడిందన్న వివాదంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నెయ్యిలో గొడ్డు కొవ్వు, ఫిష్ ఆయిల్ అవశేషాలు ఉన్నట్లు గుజరాత్‌‌‌‌కు చెందిన నేషనల్‌‌‌‌ డెయిరీ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డు (ఎన్‌‌‌‌డీడీబీ) కాఫ్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ తన రిపోర్టులో అనుమానం వ్యక్తం చేసింది. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు రాజకీయంగా మరింత అగ్గి రాజేశాయి.