- రెండేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో నిండిన సింగూరు ప్రాజెక్ట్
- 80 వేల ఎకరాల ఆయకట్టుకు ఢోకాలేదు
- ప్రస్తుత నీటిమట్టం 28.939 టీఎంసీలు
- సంబరపడుతున్న అన్నదాతలు
సంగారెడ్డి/పుల్కల్, వెలుగు: సింగూరు ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరిగి జలకళ సంతరించుకుంది. 29.917 టీఎంసీల సామర్థ్యం గల సింగూరులోకి ఎగువ నుంచి వరద నీరు చేరడంతో శుక్రవారం సాయంత్రానికి 28.939 టీఎంసీలతో ప్రాజెక్టు పూర్తిగా నిండింది. వారం రోజులుగా ఎగువన ఉన్న కర్నాటకలో కురుస్తున్న వర్షాలకు గోదావరి బేసిన్ ద్వారా సింగూరులోకి వరద నీరు భారీగా చేరింది.
డ్యామ్ లోకి 16,548 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 19048 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది. గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రాజెక్టులో ఆగస్టు మొదటి వారంలో 14.325 టీఎంసీల నీరు ఉండగా నెల రోజుల వ్యవధిలో 14 టీఎంసీలకు పైగా వరద నీరు చేరింది.
మొన్నటి వరకు ప్రాజెక్టులో నీటి కొరత కారణంగా తాగు, సాగు నీటి అవసరాలు తీరక ప్రజలు అవస్థలు పడ్డారు. తాజాగా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడడంతో ఆయకట్టు రైతుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తోంది. ప్రస్తుతం యాసంగి సాగుతో పాటు మిషన్ భగీరథ అవసరాలు తీర్చడానికి సరిపడ నీరు ఉంది.
16 టీఎంసీలు ఉంటేనే..
సింగూరు ప్రాజెక్టు సామర్థ్యం 29.917 టీఎంసీలు. నిబంధనల ప్రకారం 16 టీఎంసీలకు పైబడి నీటి నిల్వ ఉంటేనే సాగునీటి అవసరాలకు సరఫరా చేయాలి. ప్రతీ ఏడాది దిగువన ఉన్న మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్టు (ఘనాపురం)కు 4.06 టీఎంసీలు, నిజాంసాగర్ ప్రాజెక్టుకు 8.35 టీఎంసీలు, పుల్కల్, ఆందోల్, మునిపల్లి, సదాశివపేట మండలాల పరిధిలోని దాదాపు 150 చెరువులకు 2 టీఎంసీలు, సాగు నిమిత్తం 46 వేల ఎకరాలకు రెండుసార్లు నీటిని వదలాలన్న నిబంధనలు ఉన్నాయి. మిషన్ భగీరథ అవసరాలకు మరో మూడేళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరింది. ఈ వర్షాకాలం సీజన్ లో ప్రాజెక్టులో నీళ్లు లేక రైతులు పెద్దగా పంటలు సాగుచేయలేదు. ప్రస్తుతం ఆ సమస్య తొలగిపోవడంతో యాసంగి పంటలకు డోకా లేకుండాపోయింది. పైగా విద్యుత్ ఉత్పత్తికి సమస్య లేకపోవడం వల్ల గత ఏడాది కన్నా ఎక్కువ ఉత్పత్తి చేయాలనే సంకల్పంతో జెన్ కో ఆఫీసర్లు ప్రయత్నిస్తున్నారు.
సంతోషంగా ఉంది
సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు రావడంతో సంతోషంగా ఉంది. రెండేళ్ల తర్వాత సింగూరు పూర్తిస్థాయిలో నిండింది. దీంతో సాగునీటికి ఇబ్బంది తప్పినట్లయింది. నాకున్న 4 ఎకరాల్లో వరి వేసి సింగూర్ కెనాల్ నీటితో కొన్నేళ్లుగా సాగుచేస్తున్న. ఈ వానకాలంలో తుకంకు రూ.55 వేలు ఖర్చుపెట్టి వడ్లు చల్లిన. అప్పు తెచ్చి మందు సంచులు తీసుకొస్తే సాగునీరు లేక తుకం ఎండిపోయింది. అప్పులు కట్టలేక తిప్పలైతుంది. వ్యవసాయానికి సింగూరు నీరు సరఫరా చేస్తే పంటలు సక్కగా పండి దాదాపు రూ.2 లక్షల లాభం వస్తుంది.- వడిగేపల్లి నర్సింలు, మిన్పూర్, పుల్కల్
ఇక ఆ సమస్య ఉండదు
సింగూరు నిండింది. ఇక సాగునీటి సమస్య ఉండదు. ప్రాజెక్టులో నీళ్లు లేక ఇంతకాలం చాలా ఇబ్బందులు పడ్డాం. నీళ్లు లేక రెండు ఎకరాల పొలం బీడుగా మారింది. సింగూరు కెనాల్ నుంచి నీళ్లు ఇడిస్తే పంటలు బాగా పండుతాయి. ఇప్పటివరకు సింగూర్ ప్రాజెక్టులో నీళ్లు తక్కువ ఉన్నాయని పంటలకు ఇడువలేదు. దీంతో ఒక్క ఇసోజీపేట గ్రామంలోనే సుమారు 70 ఎకరాల పొలం బీడుగా మారింది. రానున్న యాసంగి పంటలకు సింగూరు నీరు ఎంతో ముఖ్యం. ఇక రైతుల కష్టాలు తీరినట్టే.
- బేగరి రవికుమార్, ఇసోజీపేట, పుల్కల్