
లోక్ సభ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాలను గెలుచుకుంది ఇండియా కూటమి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో అయితే అత్యధిక స్థానాలను గెలుచుకుని బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేసి ఆరింటిని గెలుచుకోగా, సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాను గెలుచుకుంది. బీజేపీ 33 స్థానాలకు పరిమితమైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లో జూన్ 11 నుండి 15 వరకు రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధన్యవాద యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అవినాష్ పాండే తెలిపారు. ఈ యాత్రలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. యాత్రలో వివిధ వర్గాల ప్రజలకు రాజ్యాంగ ప్రతిని ఇచ్చి సత్కరించనున్నారు. ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలు, 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.