చావా సినిమా ఎఫెక్ట్.. బంగారం కోసం జనం తవ్వకాలు

చావా సినిమా ఎఫెక్ట్.. బంగారం కోసం జనం తవ్వకాలు
  • అసిర్‌గఢ్ కోట ప్రాంతానికి భారీగా వస్తున్న జనం

బుర్హాన్‌పూర్: ఇటీవల రిలీజ్​అయిన హిందీ సినిమా చావాలో.. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో గల అసిర్‌గఢ్ కోట ప్రాంతంలో బంగారు గనులు ఉన్నాయని పేర్కొనడంతో జనం పెద్ద సంఖ్యలో వచ్చి అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. రాత్రి కాగానే.. సమీప గ్రామాల ప్రజలు టార్చ్ లైట్లు, జల్లెడలు, మెటల్ డిటెక్టర్లతో వచ్చి తవ్వకాలు జరుపుతూ మట్టిని జల్లెడ పడుతున్నారు. బాలీవుడ్​నటుడు విక్కీ కౌశల్ నటించిన చావా చిత్రంలో ఒక సన్నివేశంలో.. బుర్హాన్‌పూర్ ప్రాంతం ఛత్రపతి శంభాజీ మహారాజ్ మిలటరీ క్యాంప్​గా ఉండేదని, ఆ ప్రాంతంలో బంగారం గనులు ఉండేవని చూపించారు. 

దీనికి తోడు.. అక్కడి ఓ దర్గా సమీపంలో జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఇటీవల ఓ జేసీబీ యంత్రం మట్టిని తవ్వి స్థానిక రైతు పొలంలో పోయగా.. అందులో మొఘల్ కాలం నాటి బంగారం, వెండి నాణేలు దొరికాయని ప్రచారం జరిగింది. అప్పటి నుంచి సమీప గ్రామాల ప్రజలు ఆ ప్రాంతానికి తరలివచ్చి బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్నారు. 

అయితే, తవ్వకాలపై అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు చెప్పారు. కాగా, ఆ ప్రాంత ఎస్పీ మాట్లాడుతూ.. అనధికార తవ్వకాలు జరిపిన వాళ్లపై  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.