మేం అధికారంలోకి వస్తే కేసీఆర్ జైలుకే

  • కాంగ్రెస్ రాష్ట్ర ఇన్​చార్జ్ మాణిక్కం ఠాగూర్ హెచ్చరిక
  • కేసీఆర్ ఫ్యామిలీ అవినీతిపై విచారణకు స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తమని కామెంట్​
  • కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే కాళేశ్వరం, సీతారామ: ఉత్తమ్
  • రాష్ట్రంలో కేసీఆర్ ఫ్యామిలీ, ఖమ్మంలో పువ్వాడ ఫ్యామిలీ దోపిడీ
  • ప్రశ్నిస్తే పోలీస్ కేసులు పెడుతున్నరు: భట్టి
  • ఖమ్మంలో కాంగ్రెస్ నేతల వరుస సమావేశాలు

ఖమ్మం, వెలుగు: అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన వెంటనే కేసీఆర్​ను జైలుకు పంపడం ఖాయమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​చార్జ్ మాణిక్కం ఠాగూర్ హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతిపై విచారణకు ఢిల్లీ, హైదరాబాద్​లో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆదివారం ఖమ్మంలోని సీక్వెల్ రిసార్ట్స్​లో జిల్లాలు, సిటీల కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సన్నాహక సమావేశాలను వేర్వేరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ బూత్ కమిటీల సమావేశంలో ఠాగూర్ మాట్లాడారు. టీఆర్ఎస్, బీజేపీలు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అంటూ నాటకాలు ఆడుతున్నాయని మాణిక్కం ఠాగూర్ విమర్శించారు. అక్రమ సంపాదనపై సీబీఐ, ఈడీ, ఐటీ కేసులు తప్పించుకునేందుకే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలకు కేసీఆర్ భయంతో వంగి దండాలు పెడుతున్నారని ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెల్చుకున్నా, కార్యకర్తల కష్టాన్ని వృథా చేస్తూ మోసం చేసి అధికారం కోసం, డబ్బు కోసం ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారిని మళ్లీ ఎప్పటికీ దగ్గరకు రానీయబోమని స్పష్టం చేశారు.

పైసా ఇవ్వకున్నా నోరుమెదపట్లే: ఉత్తమ్

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి పైసా ఇవ్వకున్నా మాట్లాడలేని దద్దమ్మలు, సన్నాసులుగా టీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు మారిపోయారని పీసీసీ చీఫ్ ఉత్తమ్​కుమార్ రెడ్డి మండిపడ్డారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్​పై నోరుమెదపడం లేదన్నారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఆరోపించారు. భావితరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండగా మారుతుందని 15వ ఫైనాన్స్ కమిషన్ చెప్పిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ఫ్యామిలీ, ఖమ్మం జిల్లాలో పువ్వాడ ఫ్యామిలీ దోచుకుంటున్నాయని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే అన్నీ వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. రుణమాఫీకి నిధులు లేవని అంటున్నారని, మరి కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు మాత్రం డబ్బులున్నాయా అని ప్రశ్నించారు.

రాహుల్​ను ఏఐసీసీ చీఫ్​గా చేయాలని తీర్మానం

రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడిగా చేయాలని డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించినట్టు ఉత్తమ్ చెప్పారు. ఖమ్మం రోల్ మోడల్​గా అన్ని జిల్లాల్లో నెల రోజుల్లోగా పోలింగ్ బూత్​ల వారీగా 15 మందితో కమిటీలను వేస్తామన్నారు.

టీఆర్ఎస్ వచ్చాక అవినీతి పెరిగింది: భట్టి

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.  ప్రశ్నిస్తే పోలీస్ కేసులు పెడుతున్నారని, అక్రమంగా నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. పేదల కోసం ఇచ్చిన జీవోలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్ చేయించుకున్న స్థానిక మంత్రికి ప్రజలు బుద్ధిచెప్పాలన్నారు.  రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ బలమైన పార్టీలైతే.. కాంగ్రెస్ నేతలను చేర్చుకునేందుకు ఎందుకు వెంటపడుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. గత ఎన్నికల్లో గెలవలేని దద్దమ్మలు ఆదివారం బజార్​లో గొర్రెల్లా తమ పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను కొన్నారని రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు.

ఇవి కూడా చదవండి..

ఆర్టీసీని సర్కార్‌‌లో విలీనం చేయాలె

లైన్ దాటి మాట్లాడితే కర్రు కాల్చి వాత పెడ్త.. వినకపోతే కాళ్లు పట్టుకొని బండకు కొడతా

కేసీఆర్​ వార్నింగ్​ వెనుక మతలబేంది..? ఆరా తీస్తున్న కేడర్

వైరల్ వీడియో: మహిళా జడ్జితో నిందితుడి పరాచకాలు