ఇద్దరు కాదు నలుగురు! అఫ్జల్‌‌‌‌గంజ్ కాల్పుల కేసులో ట్విస్ట్

ఇద్దరు కాదు నలుగురు! అఫ్జల్‌‌‌‌గంజ్ కాల్పుల కేసులో ట్విస్ట్
  • యూపీ, బిహార్​కు పోలీస్ టీమ్స్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  అఫ్జల్‌‌‌‌గంజ్‌‌‌‌ కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాల్పులు, దోపిడీకి పాల్పడింది నలుగురు సభ్యుల బిహార్‌‌‌‌‌‌‌‌ ముఠా అని పోలీసులు గుర్తించారు. ఇదే గ్యాంగ్‌‌‌‌ 2015లో లక్నోలో కూడా ఇలాంటి దోపిడీ చేసినట్టు ఆధారాలు సేకరించారు. ఏటీఎం క్యాష్ రీఫిల్‌‌‌‌ కస్టోడియన్‌‌‌‌ వ్యాన్‌‌‌‌పై దాడి చేసి రూ.47 లక్షలు దోపిడీ చేసినట్టు గుర్తించారు. ఈ మేరకు యూపీ పోలీసులను సంప్రదించారు. 

ఈ నెల 17న కర్నాటక బీదర్‌‌‌‌లో సెక్యూరిటీ గార్డులపై కాల్పులు జరిపి.. రూ.93 లక్షల దోపిడీ చేసి పారిపోయే క్రమంలో అఫ్జల్‌‌‌‌గంజ్‌‌‌‌లోని రోషన్‌‌‌‌ ట్రావెల్స్‌‌‌‌ ఉద్యోగి జహంగీర్‌‌‌‌పై దొంగలు కాల్పులు జరిపిన విధానాన్ని వివరించారు. యూపీ పోలీసులు అందించిన సమాచారంతో ఇదే బిహార్ గ్యాంగ్‌‌‌‌ బీదర్‌‌‌‌‌‌‌‌లో కూడా దోపిడీ చేసినట్టు నిర్ధారణకు వచ్చారు.

అయితే బీదర్‌‌‌‌ దోపిడీలో పాల్గొన్నది అమిత్‌‌‌‌, అనిశ్‌‌‌‌ ఇద్దరేనని వార్తలు వస్తుండగా.. అది నిజం కాదని, మొత్తం నలుగురు సభ్యుల ముఠా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దృష్టి మళ్లించేందుకు రెండు బైక్స్‌‌‌‌ వినియోగించారని అనుమానిస్తున్నారు. ఇప్పటికే సేకరించిన సీసీటీవీ ఫుటేజీలు, యూపీ పోలీసులు అందించిన వివరాల ఆధారంగా సెర్చ్ ఆపరేషన్‌‌‌‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ టీమ్‌‌‌‌ యూపీకి, మరో రెండు టీమ్స్‌‌‌‌ బిహార్‌‌‌‌‌‌‌‌కు వెళ్లినట్టు సమాచారం. దొంగలకు సంబంధించిన లీడ్స్‌‌‌‌ లభించిన వెంటనే దాడులు చేసి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అతి త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.