కోర్టు జడ్జీలను దూషించిన కేసులో.. మీడియాకు నోటీసులు

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగిన పరిణామాల్లో హైకోర్టు జడ్జిలు, దిగువ కోర్టు న్యాయమూర్తులపై దూషణల పర్వం కొనసాగింది. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ (కంటెంప్ట్ పిటిషన్) పిటిషన్ దాఖలు చేశారు ప్రభుత్వ ఏజీ(అడ్వకేట్ జనరల్). దీనిపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. దీనిపై అడ్వకేట్ జనరల్ తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో 26 మందిని ప్రతివాదులుగా చేర్చారు.

ALSO READ : మెసేజ్​లు వస్తున్నా డబ్బులు జమ కావట్లే: జీకే ఈదన్న

ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయని పిటిషన్ లో ఏజీ వెల్లడించారు. న్యాయస్థానాలు, జడ్జిలను దూషించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌ లో కోరారు ప్రభుత్వ ఏజీ. గడచిన రెండు వారాల్లోని పరిణామాలను పిటిషన్‌ లో వివరించారు. కోర్టుల గౌరవానికి భంగం కలిగించారని తెలిపారు. న్యాయవిధులను నిర్వర్తిస్తున్న వారిపై దూషణలకు దిగారంటూ పిటిషన్‌ లో వెల్లడించారు. న్యాయవ్యవస్థకు ఉన్న విలువలను ధ్వంసం చేసేలా వ్యవహరించారంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

ట్విట్టర్, ఫేస్ బుక్, బుద్ధా వెంకన్నతో సహా 26 మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఇద్దరు హైకోర్టు జడ్జిలు, ఏసీబీ జడ్జి ఫ్యామిలీలు టార్గెట్ గా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని తెలిపారు. జడ్జిలను ట్రోలింగ్ చేయటానికి ప్రత్యేకంగా ఒక క్యాంపెయిన్  నిర్వహించారని చెప్పారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది.