- మేడిగడ్డను స్టోరేజీకి వాడుతామని ఇరిగేషన్ అధికారులు మాకు చెప్పలేదు
- కాళేశ్వరం కమిషన్ ముందు టీజీఈఆర్ఎల్ జేడీ మనోజ్ వెల్లడి
- బ్యారేజీలు కడ్తూనే మోడల్ స్టడీస్ చేయించారు
- గేట్లను తక్కువ ఎత్తుకు ఎత్తి పరీక్షలు చేశారు
- దాంతో ప్రవాహ వేగం అంచనా వేయలేకపోయాం
- టెయిల్వాటర్ లెవెల్స్ తగ్గి.. మట్టి కొట్టుకుపోయి బ్యారేజీ కుంగిందని వ్యాఖ్య
- టీజీఈఆర్ఎల్, ఎస్డీఎస్వో ఆఫీసర్లను విచారించిన కమిషన్ చైర్మన్ ఘోష్
హైదరాబాద్, వెలుగు : మేడిగడ్డను బ్యారేజీగానే పరిగణించి మోడల్ స్టడీస్ చేశామని.. దానిని డ్యామ్లా స్టోరేజీకి వాడుతారనే సంగతి ఇరిగేషన్ అధికారులు తమకు చెప్పలేదని తెలంగాణ ఇంజినీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీస్ (టీజీఈఆర్ఎల్) జాయింట్ డైరెక్టర్ఏజీ మనోజ్‌కుమార్ కాళేశ్వరం కమిషన్ ముందు స్పష్టం చేశారు. ‘బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడానికి వీల్లేదు.. ఫ్రీ ఫ్లో ఉండాల్సిందే.. మేము టెస్టులు చేసే సమయంలో మాకు బ్యారేజీ అని చెప్పారే తప్ప.. నీటిని స్టోర్ చేస్తామని ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదు’ అన్నారు.
మోడల్ స్టడీస్ చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారుల నుంచి 2016 అక్టోబర్ 18న తొలి రిఫరెన్స్ వచ్చిందని.. కానీ, అప్పటికే మేడిగడ్డ బ్యారేజీ ప్రారంభమైందన్నారు. దీంతో మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు జరుగుతుండగానే మోడల్ స్టడీస్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. 2017, 2018ల్లోనూ రిఫరెన్సులు ఇచ్చారన్నారు. శుక్రవారం బీఆర్కే భవన్లో టీజీఈఆర్ఎల్, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్(ఎస్డీఎస్వో) అధికారులను కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు.
పలువురు అధికారులు ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెల్లమొహం వేశారు. మూడు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఎవరి నుంచి ఒత్తిళ్లు, ఆదేశాలు వచ్చేవని ఆయన ప్రశ్నించగా.. అధికారులంతా తమకేం తెలియదని, చెప్పలేమని సమాధానాలు చెప్పుకొచ్చారు. ఓ మహిళా అధికారి అయితే.. ఏం అడిగినా ‘తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా’ అనే ఆన్సర్లు తప్ప ఏ ఒక్క ప్రశ్నకూ సరైన సమాధానం చెప్పకపోయారు. మొత్తంగా శుక్రవారం టీజీఈఆర్ఎల్ జేడీ, మాజీ సీఈ, ముగ్గురు రీసెర్చర్ ఆఫీసర్లు, ఎస్డీఎస్వో సీఈ, ఈఈ, సీడీవో ఈఈలను జస్టిస్ ఘోష్ విచారించారు.
నాలుగు కండిషన్లతో మోడల్ స్టడీస్
మోడల్ స్టడీస్‌ను నాలుగు కండిషన్ల ఆధారంగా చేస్తామని టీజీఈఆర్ఎల్ జేడీ మనోజ్ కుమార్ తెలిపారు. గరిష్ట వరద అంచనాల ప్రకారమే స్టడీస్ ఉంటాయన్నారు. అంచనా వేసిన గరిష్ట వరదలో మొత్తం వరద (100 శాతం), 75 శాతం, 50 శాతం, 25 శాతం వరద వస్తే బ్యారేజీ ఎలా ఉంటుందన్న దాని ప్రకారం 2డీ, త్రీడీ మోడల్ స్టడీస్ చేస్తామన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి 2017 మే, 2018 ఆగస్టు, 2019 జూన్, 2023 మేలో పలు రకాల మోడల్ స్టడీస్ నిర్వహించామని చెప్పారు. ఇటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకూ పరీక్షలను నిర్వహించామని తెలిపారు. ఆయా బ్యారేజీలకు సంబంధించిన 12 మోడల్ స్టడీస్ నివేదికలను జస్టిస్ ఘోష్‌కు సమర్పించారు.
గేట్లను తక్కువ ఎత్తులో తెరిచి పరీక్షలు
టెయిల్ వాటర్ లెవెల్ పరీక్షలు చేసేందుకు బ్యారేజీ గేట్లను కనీసం 2 మీటర్లు ఎత్తాల్సి ఉంటుందని.. కానీ, మేడిగడ్డ విషయంలో తక్కువ ఎత్తుకు ఎత్తి పరీక్షలు చేశారని మనోజ్ కుమార్ పేర్కొన్నారు. దీంతో సెకనుకు 3 నుంచి 6 మీటర్లు ఉండాల్సిన వరద ప్రవాహ వేగం.. సెకనుకు 15 మీటర్లుగా వచ్చిందన్నారు. దాని వల్లే వరద ప్రవాహ వేగాన్ని అంచనా వేయలేకపోయామన్నారు. దీంతో 2019లో వచ్చిన వరదలకు.. ప్రవాహ వేగం ఎక్కువగా ఉండడం వల్లే బ్యారేజీ దిగువన ఉండే టెయిల్వాటర్ లెవెల్స్ తక్కువై 2019లో తొలిసారిగా బ్యారేజీకి డ్యామేజ్ జరిగిందన్నారు.
ఇంకా నష్టం జరగకుండా ఉండేందుకు సలహాలు ఇవ్వాలని 2020లో అధికారులు తమను సంప్రదించారని.. 2021, 2023లో పలు సిఫార్సులు చేశామని వివరించారు. కాగా, మేడిగడ్డ బ్యారేజీని స్టోరేజీ పర్పస్ కోసం డ్యాములా వాడుకుంటున్నారని మరికొందరు అధికారులు కూడా చెప్పారు.
తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా..!
ఆమె ఒక సీఈ. డిపార్ట్మెంట్లో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఒకప్పుడు టీజీఈఆర్ఎల్లో సీఈగా పనిచేసిన ఆమె.. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన మోడల్స్టడీస్లో కీలకంగా పనిచేశారు. కానీ, కాళేశ్వరం కమిషన్ విచారణలో మాత్రం ఏ ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పలేదు. కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ మోడల్ స్టడీస్‌కు సంబంధించి ఆమెకు పలు ప్రశ్నలు సంధించారు. మోడల్ స్టడీస్ ఎప్పుడు చేశారు? బ్యారేజీలు కడుతున్నప్పుడే చేశారా?
బ్యారేజీలు కట్టకముందు చేశారా? స్టడీస్‌కు సంబంధించిన రిపోర్టులు ఇచ్చారా? మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయం తెలుసా? బ్యారేజీకి డ్యామేజ్ ఎప్పుడు జరిగింది? వంటి ఎన్నో ప్రశ్నలు అడిగారు. కానీ, ఆమె ఏ ప్రశ్న అడిగినా ‘నాకు తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా’ అంటూ దాటవేశారు. కొన్ని ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా తెల్ల మొహం వేశారు. దీంతో జస్టిస్ పీసీ ఘోష్ ఒకింత షాక్‌కు గురయ్యారు.
మేడిగడ్డ డ్యామేజీపై ఫీల్డ్ ఆఫీసర్లు చెప్పలే: ఎస్డీఎస్వో సీఈ
వాస్తవానికి డ్యామ్‌సేఫ్టీ యూనిట్లు (డీఎస్‌యూ) బ్యారేజీలకు సంబంధించి ప్రీ మాన్సూన్, పోస్ట్ మాన్సూన్ రిపోర్టులేవీ ఇవ్వలేదని ఎస్డీఎస్వో సీఈ ప్రమీల స్పష్టం చేశారు. బ్యారేజీ కుంగాక పోస్ట్మాన్సూన్ రిపోర్ట్ తయారు చేశారని, ఆ రిపోర్ట్‌లోనే బ్యారేజీకి డ్యామేజ్జరిగిందన్న విషయం తమకు తెలిసిందని ఆమె తెలిపారు. బ్యారేజీల్లో లీకేజీలకు సంబంధించిన వివరాలేవీ ఫీల్డ్ అధికారులు తమకు చెప్పలేదని పేర్కొన్నారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ సరిగ్గా జరగలేదని, బ్యారేజీ సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదని, డ్యామ్‌సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించలేదని తెలిపారు.
రూల్‌బుక్‌లో ఉన్న ఓ అండ్ ఎం ప్రొటోకాల్, గేట్స్ ప్రొటోకాల్‌ను పాటించలేదని పేర్కొన్నారు. కాగా, మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజ్‌పై ప్రాజెక్ట్ అధికారులు ఎస్డీఎస్వోకు సమాచారం ఇవ్వలేదని ఎస్డీఎస్వో ఈఈ విజయలక్ష్మి చెప్పారు. బ్యారేజీని 2022 అక్టోబర్ 28న సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ ఏబీ పాండ్యాతో కలిసి పరిశీలించామని, అప్పుడే ఆయన కొన్ని సూచనలు చేశారని తెలిపారు. పియర్ల నిర్మాణం జరిగేటప్పుడు ఎస్డీఎస్వో అధికారులు సైట్‌ను పరిశీలించలేదన్నారు.
పై అధికారుల ఆదేశాలతోనే : సీడీవో ఈఈ
డ్యామ్ సేఫ్టీ చట్టం రావడానికి ముందే డ్యామ్ సేఫ్టీ సెల్స్ ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రాలను సీడబ్ల్యూసీ ఆదేశించిందని సీడీవో ఈఈ రఘునాథ్ శర్మ చెప్పారు. దీంతో 1995లో ఉమ్మడి రాష్ట్రంలో జీవో 382 ప్రకారం డ్యామ్ సేఫ్టీ సెల్‌ను ఏర్పాటు చేశారన్నారు. ఈఈ దానికి చీఫ్‌గా ఉండేవారన్నారు. అయితే, ఆ తర్వాత దాని బాధ్యతలు ఎస్ఈ స్థాయి అధికారి చూసేలా జీవో 140 ద్వారా అధికారాలు కల్పించారన్నారు.
బ్యారేజీ కుంగడానికి ఓ అండ్ ఎం నిర్లక్ష్యం ఒక్కటే ప్రధాన కారణం కాదని, పాలసీ గ్యాప్ ఉండడం వల్లే నష్టం జరిగిందని అన్నారు. తన అభిప్రాయ ప్రకారం డిపార్ట్మెంట్లోని పై స్థాయి అధికారుల నిర్లక్ష్యమే మేడిగడ్డ కుంగడానికి కారణమై ఉంటుందని అన్నారు.