
ఆగాఖాన్ తన జీవితకాలమంతా ధర్మాన్ని ప్రేమించాడు. అసమానతలను అసహ్యించుకున్నాడు. మహోన్నత స్థానం సంపాదించాడు. ఒక మతపెద్దగా, భారతదేశ భక్తునిగా, తత్వవేత్తగా, క్రీడాకారుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు. హిజ్ హైనెస్ వి రైట్ ఆనరబుల్ సర్ సుల్తాన్ మొహమ్మద్ షా అందరికీ 3వ ఆగాఖాన్గా తెలుసు. ఆయన చిన్నవయసులోనే మార్గదర్శకుడిగా, తత్వవేత్తగా గౌరవ మర్యాదలు సంపాదించాడు. ఆయన వంశం పేరు నిలబెట్టడమేగాక చరిత్రలో ప్రసిద్ధికెక్కినవారిలో ఒకరిగా నిలిచాడు. అందుకే పూర్వ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా సర్ సామ్యూల్ హోర్ ఆగాఖాన్ను ‘‘ప్రపంచపౌరుడు” అని మెచ్చుకున్నాడు.
పర్షియా రాజవంశానికి చెందిన ఆగాఖాన్.. ఆ వంశంలో మూడో తరంవాడు. ఆయన తాత ఆగాఖాన్.. మహల్లా ప్రభువు. పరిస్థితుల ప్రభావం, కొన్ని కుట్రలవల్ల దేశబహిష్కరణకు గురయ్యాడు. దాంతో బొంబాయి వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. తనను దత్తత తీసుకున్న దేశం కోసం, దేశ పౌరుల కోసం ఆయన చేసిన సేవలకుగాను భారతీయ దేశభక్తుడిగా, ఆదర్శనేతగా ఆయన్ను మనదేశం గౌరవించింది. ఆ సేవలను ఆగాఖాన్ –3 దశాబ్దాల వరకు కొనసాగించాడు.
►ALSO READ | ప్రమాదం నుంచి కాపాడే మంచి మనసుంటే.. మీరే గుడ్ సమరిటాన్.. ఎలాంటి కేసులు ఉండవు
ఆగాఖాన్ 8 ఏండ్ల వయసులో తన తండ్రిని కోల్పోయాడు. ఏడాది తర్వాత గౌరవప్రదమైన బిరుదు ‘హిజ్ హైనెస్’ను ఆయనకు ప్రదానం చేశారు. ఆగాఖాన్కు 16 సంవత్సరాల వయసు వచ్చేవరకు లేడీ ఆలీ షా అతని వ్యవహారాలన్నీ చక్కబెట్టింది. పర్షియన్, అరబిక్, ఇంగ్లీష్ నేర్పించింది. ప్రపంచ పౌరునిగా తయారవ్వడానికి సాహిత్యం మొదలుకొని చరిత్ర, గణితం, తత్వం, విజ్ఞాన శాస్త్రం, భూగోళం, కళలు అన్నీ నేర్పించింది. అతి కొద్దికాలంలోనే ఆయన ఆధ్యాత్మిక నాయకుడిగా బాధ్యతలు తీసుకుని, ఎంతో ప్రభావం చూపాడు. పెద్దవాడయ్యాక ఇండియా, ఇంగ్లాండ్తో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నాడు. బొంబాయి ఒక గొప్ప ‘పోర్ట్ సిటీ’గా డెవలప్ కావడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది.
1897లో ఇండియాలో వచ్చిన భయంకరమైన కరువు సమయంలో కచ్, కథియవార్, పూనా, బొంబాయిల్లో ‘క్యాంపులు’ తెరిచాడు. విద్యావేత్తగా దేశంలో స్త్రీలకు విద్యాభ్యాసం కోసం సౌకర్యాలు కల్పించాలని గొంతెత్తి నినదించిన మొదటి వ్యక్తి ఈయన. బాల్యవివాహాలు, పర్దా పద్ధతి, బలవంతపు వైధవ్యం, ఇంకా అనేక సాంఘిక దురాచారాలను ఆయన తీవ్రంగా ఖండించాడు. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ డెవలప్మెంట్కు కృషి చేశాడు. అందుకే 1924 ఫిబ్రవరిలో ‘కౌన్సిల్ ఆఫ్ స్టేట్’ ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానంలో ‘హిజ్ హైనెస్ సర్ సుల్తాన్ మొహమ్మద్ షా, ఆగా ఖాన్.. నోబెల్ శాంతి బహుమతికి అర్హుడిగా పేర్కొన్నారు.
- మేకల మదన్మోహన్ రావుకవి, రచయిత