భోపాల్‌లో శుక్రవారంరాత్రి నుంచే అమలు.. 10 రోజుల దాకా ఆంక్షలు
కేవలం ఎస్సెన్షియల్ సర్వీసులకే పర్మిషన్
పశ్చిమ బెంగాల్‌లో బుధ, శనివారాల్లో లాక్‌డౌన్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో కొన్ని రాష్ట్రాలు మళ్లీ లాక్‌డౌన్ బాట పడుతున్నాయి. మేజర్ సిటీల్లో ఆంక్షలు విధిస్తున్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం భోపాల్ లో ఈ నెల 24న 8గంటల నుంచి 10 రోజుల పాటు (ఆగస్టు4 వరకు) కంప్లీట్ లాక్ డౌన్ విధించింది. కేవలం అత్యవసర సర్వీసులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. శుక్రవారం రాత్రి 8గంటల నుంచే భోపాల్ లో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. లాక్‌డౌన్ విధిస్తామని ప్రభుత్వం ముందే ప్రకటించడంతో… జనం సరుకులు కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు క్యూ కట్టారు. సిటీలోని మార్కెట్లన్నీ శుక్రవారం జనంతో కిటకిటలాడాయి. కోలార్ రోడ్, ఎంపీ నగర్, లఖేరాపురా, జుమేరాతి, న్యూ భోపాల్ లోని మార్కెట్లు, సూపర్ మార్కెట్లకు జనం బారులుతీరారు. ఇదే అదనుగా వెజిటెబుల్స్ ధరలను వ్యాపారులు విపరీతంగా పెంచేశారు. జనం పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. 8గంటల నుంచి లాక్‌డౌన్ స్టార్ట్అవుతుందని, మార్కెట్ ప్రాంతాల నుంచి అందరూ వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించినా… జనం పట్టించుకోలేదు. ‘‘కొన్ని రోజులకు సరిపడా సరుకులు కొనుగోలు చేశాను. ప్రభుత్వం10 రోజుల లాక్‌డౌన్ అని చెప్పింది. కానీ ఒకవేళ దాన్ని పొడిగిస్తే కూడా ఇబ్బందులు ఉండకూడదనే గ్రోసరీస్ ఎక్కువగా కొన్నాను” అని విజయ్ రఘువంశీ తెలిపారు. ప్రజలు అవసరమైన దానికంటే ఎక్కువ సరుకులు కొనుగోలు చేశారని, ఒకవేళ లాక్‌డౌన్ పొడిగిస్తారేమోననే భయంతోనే వాళ్లిలా చేశారని ఓ షాప్ ఓనర్ పేర్కొన్నారు.
బెంగాల్ లో వారానికి రెండ్రోజులు…
కరోనా కట్టడికి పశ్చిమ బెంగాల్ లో వారానికి రెండ్రోజులు లాక్ డౌన్ విధిస్తున్నారు. ప్రతి వారంలో బుధ, శనివారాలు రాష్ట్రవ్యాప్తంగా అన్నీ బంద్ చేస్తున్నారు. కేవలం మెడికల్ సంబంధ సర్వీసులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. షాపులు, మార్కెట్లు, పబ్లిక్ ట్రాన్స్ పోర్టును బంద్ చేస్తున్నారు. లాక్ డౌన్ రోజుల్లో కోల్ కతా ఎయిర్ పోర్టుకు విమానాలను కూడా నిలిపివేశారు. ఈ మేరకు రాష్ట్రసర్కార్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి విజ్ఞప్తి చేసింది. శనివారం కొన్ని ట్రైన్లను కూడా రద్దు చేశారు.