సహజీవనం తప్పు.. సేమ్‌ సెక్స్‌ మ్యారేజ్లు సమాజానికి విరుద్ధం: కేంద్ర మంత్రి గడ్కరీ

సహజీవనం తప్పు.. సేమ్‌ సెక్స్‌ మ్యారేజ్లు సమాజానికి విరుద్ధం: కేంద్ర మంత్రి గడ్కరీ

న్యూఢిల్లీ: లివ్-ఇన్ రిలేషన్​షిప్​తప్పు అని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. సేమ్‌ సెక్స్‌ మ్యారేజ్‌లు సమాజ నిబంధనలకు విరుద్ధమని, సామాజిక నిర్మాణం పతనానికి దారితీస్తాయని ఆయన పేర్కొన్నారు. ఓ యూట్యూబ్ పోడ్‌కాస్ట్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బ్రిటిష్ పార్లమెంట్‌ పర్యటనకు వెళ్లినప్పుడు చోటుచేసుకున్న అంశాలను ఆయన గుర్తుచేశారు. యూకేలో పెండ్లిని వ్యతిరేకించడం, లివ్-ఇన్ రిలేషన్​షిప్ ఎంచుకోవడమే అతిపెద్ద సమస్య అని తెలిపారు. "పెండ్లి చేసుకోకుంటే పిల్లలు ఎలా పుడతారు? అలాంటి పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది? సమాజ నిర్మాణానికి వ్యతిరేకంగా వెళితే, దాని ప్రభావం ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?" అని గడ్కరీ ప్రశ్నించారు.

సమాజం అంతిమంగా సొంత నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అయితే, దేశంలో సమతుల్య లింగ నిష్పత్తిని కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. "1,500 మంది మహిళలు, వెయ్యి మంది పురుషులు ఉంటే.. అప్పుడు పురుషులకు ఇద్దరు భార్యలను అనుమతించవలసి ఉంటుంది" అని గడ్కరీ వ్యాఖ్యానించారు. ఆదర్శ భారతదేశంలో విడాకులను నిషేధించాల్సిన అవసరాన్ని ఆయన తిరస్కరించారు. గత ఏడాది స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వడానికి సుప్రీంకోర్టులోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం నిరాకరించిన విషయం తెలిసిందే.