బీఆర్ఎస్​ పాలనలో నిరుద్యోగుల బతుకులు ఆగం : వికాస్​రావు

వేములవాడ, వెలుగు: బీఆర్ఎస్​ పాలనలో నిరుద్యోగుల బతుకులు ఆగమయ్యాయని వేములవాడ బీజేపీ అభ్యర్థి డా. చెన్నమనేని వికాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు  అన్నారు. వేములవాడ మున్సిపల్​ పరిధిలోని నాంపల్లి, అంజనీ నగర్, భగవంతరావునగర్, తిప్పాపూర్ కోనాయపల్లిలో తన సతీమణి దీపతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్​ అసమర్థ పాలన, అవినీతి వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగాయని, దీంతో రూ.లక్షల కోట్ల ప్రజాధనం వృథా అయిందన్నారు.

కాంగ్రెస్ హయాంలో అన్నీ స్కాములేనని, నరేంద్ర మోదీ వచ్చాక పూర్తి పారదర్శకంగా ఎలాంటి అవినీతి లేకుండా పాలన సాగుతోందన్నారు. బీజేపీ రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ చేసి యువతకు ఉపాధి కల్పించినట్లు చెప్పారు. పసుపు బోర్డు తీసుకువచ్చి పసుపు రైతుల కళ్లలో ఆనందం నింపిందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పట్టణ అధ్యక్షుడు సంతోష్ బాబు పాల్గొన్నారు.