సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ పెంపు

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ పెంపు
  •  35 నుంచి 40 ఏండ్లకు పెంచిన యాజమాన్యం
  • 2018 మార్చి నుంచే వర్తింపు  
  • సింగరేణి సీఎండీ బలరాం ఉత్తర్వులు 
  • దాదాపు 700 మందికి లబ్ధి
  • ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్/కోల్​బెల్ట్/గోదావరిఖని, వెలుగు: సింగరేణి యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. వారసత్వ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్​ను 35 నుంచి 40 ఏండ్లకు పెంచింది. ఈ మేరకు సింగరేణి సీఎండీ బలరాం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని 2018 మార్చి నుంచే వర్తింపజేస్తామని అందులో పేర్కొన్నారు. ఏజ్ లిమిట్ దాటిపోయి వారసత్వ ఉద్యోగాలకు అర్హత కోల్పోయి చాలామంది కార్మికుల వారసులు ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వయోపరిమితి పెంచాలని కార్మిక సంఘాలు చాలా ఏండ్లుగా డిమాండ్​ చేస్తున్నాయి. 

కానీ గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కోల్​బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని సీఎం రేవంత్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి సింగరేణి యాజమాన్యంతో చర్చలు జరిపించారు. వయోపరిమితి పెంచుతూ సింగరేణి యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో దాదాపు 700 మంది కార్మికుల వారసులకు లబ్ధి చేకూరనుంది. 

2018 నుంచి వారసత్వ ఉద్యోగాలు.. 

సింగరేణిలో 2018 ఏప్రిల్ నుంచి వారసత్వ ఉద్యోగాల విధానం అమలు చేస్తున్నారు. సంస్థలో పనిచేస్తూ కార్మికుడైనా, ఉద్యోగైనా చనిపోతే.. వాళ్ల వారసుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తారు.  అలాగే అనారోగ్య కారణాల రీత్యా మెడికల్ బోర్డు అన్​ఫిట్​గా ప్రకటించిన కార్మికుల వారసులను కూడా ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఈ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ 35 ఏండ్లు పెట్టారు. కానీ 2018 ఏప్రిల్​ నుంచి మెడికల్​ఇన్​వాలిడేషన్​ అయిన కార్మికుల వారసుల్లో చాలామందికి  36 నుంచి 38 ఏండ్లు ఉండటంతో, వాళ్లు వారసత్వ ఉద్యోగాలకు అనర్హులయ్యారు.

 అలాగే కరోనా సమయంలో రెండేండ్ల పాటు మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం వల్ల మరికొందరు వయోపరిమితి దాటిపోయారు. దీంతో ఏజ్​ లిమిట్ ​40 ఏండ్లకు పెంచాలని చాలా కాలంగా కార్మికులు  డిమాండ్​ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ దాటిపోవడంతో ఉద్యోగం రాదని కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో ఫైనల్ సెటిల్ మెంట్ చేసుకున్నారు. 

మాట తప్పిన కేసీఆర్.. 

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని 40 ఏండ్లకు పెంచాలని ఏడేండ్ల కింద అప్పటి చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అసెంబ్లీలో కోరారు. దీనిపై అప్పటి సీఎం కేసీఆర్ స్పందించి.. 40 ఏండ్లకు పెంచుతామని ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కార్మికుల కుటుంబాలు ఉద్యోగాల కోసం ఏండ్లకేండ్లు ఎదురుచూసి ఇబ్బందులు పడ్డాయి. కార్మికుడు మెడికల్ ఇన్​వాలిడేషన్​అయిన తర్వాత అతనికి రావాల్సిన జీతం ఆగిపోతుంది. వెంటనే వారసుడికి ఉద్యోగం కల్పిస్తే కుటుంబం గడవడానికి ఇబ్బంది ఉండదు. 

ఇటు కార్మికుడికి ఉద్యోగం లేక, అటు వారసునికి ఉద్యోగం రాక ఆయా కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాయి. వారసునికి ఉద్యోగం వస్తుందనే ధీమాతో సింగరేణి కేటాయించిన క్వార్టర్​ను కంపెనీకి అప్పగించలేదు. క్వార్టర్ ​అప్పగించకపోవడం వల్ల కార్మికుడికి రావాల్సిన లక్షల  గ్రాట్యూటీ డబ్బులు కూడా నిలిపివేశారు. 

మాట నిలుపుకున్న రేవంత్..  

వారసత్వ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ పెంచేందుకు కృషి చేస్తామని అసెంబ్లీ ఎన్నికల టైమ్​లో కోల్​బెల్ట్ ప్రాంతంలోని వివిధ పార్టీల అభ్యర్థులు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా సింగరేణిలోని ప్రైవేట్ ఉద్యోగాల్లో  స్థానికులకు 80 శాతం రిజర్వేషన్ కల్పించాలని సీఎం రేవంత్​రెడ్డిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి కోరారు. ఈ సందర్భంగా వారసత్వ ఉద్యోగాలకు వయోపరిమితి కూడా 40 ఏండ్లకు పెంచాలని కోరగా, సీఎం సానుకూలంగా స్పందించారు. ఫిబ్రవరి7న హైదరాబాద్​లో జరిగిన సింగరేణి జాబ్​మేళాలో పాల్గొన్న సీఎం రేవంత్.. ఏజ్ లిమిట్ పెంపుపై ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చేసిన విజ్ఞప్తిని గుర్తు చేశారు.

 ఈ విషయమై సింగరేణి యాజమాన్యంతో చర్చించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సింగరేణి సీఎండీ బలరాంకు సూచించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సింగరేణి యాజమాన్యం.. బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో  చర్చించి వయోపరిమితిని 40 ఏండ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇన్ని రోజులు ఎన్నికల కోడ్ ఉండడంతో, తాజాగా దీనిపై ఉత్తర్వులు జారీ చేశారు. 

సాధారణ ఉద్యోగాలకు 30 ఏండ్లే.. 

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు మాత్రమే ఏజ్ లిమిట్ 35 నుంచి 40 ఏండ్లకు పెంచారు. నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేసే సాధారణ ఉద్యోగాలకు ఎప్పటిలాగానే ఏజ్ లిమిట్ 30 ఏండ్లు ఉంటుంది. దేశంలోని బొగ్గు సంస్థలలో ఉద్యోగాలు పొందేందుకు కోల్​మైన్స్​ యాక్ట్​ ప్రకారం వయసును 18 సంవత్సరాలుగా నిర్ణయించారు. అండర్​ గ్రౌండ్ ​కోల్​ మైన్స్​లోకి నడుచుకుంటూ వెళ్లి డ్యూటీ చేసి మళ్లీ పైకి వచ్చే ఉద్యోగం కావడంతో చాలా మంది మోకాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల మాదిరి ఎక్కువ ఏజ్ ఉన్నోళ్లు సింగరేణిలో చేరేందుకు అవకాశం లేదు. 


అర్హులకు వెంటనే ఉద్యోగాలు..  

ఏజ్ లిమిట్ ను 40 ఏండ్లకు పెంచడంతో అర్హులైన వారికి వెంటనే ఉద్యోగాలు ఇస్తాం. ఇది 2018 మార్చి 9 నుంచే వర్తిస్తుంది. వారసత్వ ఉద్యోగాల కోసం సంబంధిత ఏరియాలో అర్హులు దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఇప్పటికే ఉద్యోగానికి బదులు సెటిల్ మెంట్ చేసుకున్నవారు గానీ, అర్హులైన వేరే వారసుడికి ఉద్యోగం పొందినవారు గానీ దీనికి అనర్హులు. ఇప్పటివరకు పాత గరిష్ట వయోపరిమితి నిబంధన ప్రకారం ఉద్యోగం పొందలేని, ఎటువంటి సెటిల్మెంట్ జరగని కేసులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.  

  సింగరేణి సీఎండీ బలరాం 

సీఎం రేవంత్ మాట నిలుపుకున్నరు.. 

వారసత్వ ఉద్యోగాలకు ఏజ్​ లిమిట్ పెంచాలని సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్​బాబును గతంలో యూనియన్​ పక్షాన కోరాం. దీనిపై వాళ్లు సానుకూలంగా స్పందించి తప్పకుండా పెంచుతామని మాట ఇచ్చారు. సీఎం రేవంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.   

బి.జనక్​ప్రసాద్, ఐఎన్​టీయూసీ సెక్రటరీ జనరల్​

కేసీఆర్ మాట నిలుపుకోలేదు.. 

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి 2018లో అప్పటి కేసీఆర్​ ప్రభుత్వం ఒప్పుకుంది. అయితే ఏజ్​ లిమిట్​ను 35 నుంచి 40 ఏండ్లకు పెంచాలని అప్పటి చెన్నూర్​ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అసెంబ్లీలో ప్రస్తావించగా, అప్పటి సీఎం కేసీఆర్​సానుకూలంగా స్పందించారు. కానీ దాన్ని అమలు చేయలేదు. కాంగ్రెస్​ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. ఏజ్ లిమిట్ పెంచడంతో ఎంతోమంది కార్మికుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.  

 వి.సీతారామయ్య, ఏఐటీయూసీ ప్రెసిడెంట్