సింగరేణిలో జేఎంఈటీ ఉద్యోగాలకు వయోపరిమితి సడలింపు

సింగరేణిలో జేఎంఈటీ ఉద్యోగాలకు వయోపరిమితి సడలింపు

గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో భర్తీ చేయనున్న మైనింగ్​ ఇంజినీరింగ్ ​ట్రైనీ (జేఎంఈటీ) పోస్టులకు సంబంధించి వయో పరిమితి సడలించాలని నస్పూర్​లోని సింగరేణి పాలిటెక్నిక్​కాలేజీ ఫైనల్ ​ఇయర్ ​స్టూడెంట్​ అనవేన సుభాష్​ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఆగస్టు7వ తేదీలోపు కౌంటర్ ​ఫైల్ ​చేయాలని  కోర్టు సింగరేణి సీఎండీకి సూచించింది. శుక్రవారం హైదరాబాద్​ సింగరేణి భవన్​లో ఆ సంస్థ సీఎండీ బలరామ్​నాయక్​ను కలిసిన సుభాష్ ​హైకోర్టు కాపీ అందజేశారు. సింగరేణిలో100 జూనియర్ మైనింగ్ ఇంజినీరింగ్ ట్రైనీ (జేఎంఈటీ) పోస్టులకు 2024 మే 15న నోటిఫికేష‌న్ విడుద‌లైంది. 

ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్యర్థుల వ‌య‌స్సు మే15 నాటికి 18 ఏండ్లు పూర్తయి ఉండాల‌ని అందులో పేర్కొన్నారు. కానీ, అప్పుడు ఎలక్షన్ ​కోడ్ అమ‌ల్లో ఉండడం, ఇత‌ర సాంకేతిక కారణాలతో ద‌ర‌ఖాస్తుల‌ స్వీక‌ర‌ణ ప్రక్రియ నిలిపివేశారు. కోడ్ జూన్ 8న ముగియ‌గా, జూన్ 10 నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీకరించారు. అయితే, ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభపు తేదీ నుంచే అభ్యర్థుల వ‌య‌స్సు లెక్కించాల‌ని, మే 15న నోటిఫికేష‌న్ వ‌చ్చినా అధికారులు వెబ్‌సైట్ నిలిపివేశార‌ని, అభ్యర్థుల వ‌య‌స్సును జూన్ 15 నుంచి ప‌రిగ‌ణిస్తే మ‌రికొంత మందికి అవ‌కాశం ద‌క్కుతుంద‌ని సుభాష్ ​హైకోర్టుకు వెళ్లాడు. చాలా ఏండ్ల తర్వాత జూనియ‌ర్ మైనింగ్ ఇంజినీర్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుద‌లైందని, ఈ సారి అవ‌కాశం చేజారితే తిరిగి నోటిఫికేష‌న్ ఎప్పుడో పడుతుందో తెలియ‌ద‌ని, తనలాంటి వారికి అవ‌కాశం ఇవ్వాల‌ని సుభాష్ కోర్టును కోరారు.