రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ లో నిర్దేశించిన భూభాగంలో అక్రమంగా నివాసం ఉంటున్న వలస గిరిజనేతరులకు దొడ్డి దారిన భూములపై హక్కులు కల్పించాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఇండ్లపై హక్కులు కల్పించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న జీవోలను ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణ హైకోర్టు ద్వారా వాటిని రద్దు చేయిస్తూ వస్తున్నాం. అయినా ప్రభుత్వం తీరులో మార్పు రావడం లేదు. వలస గిరిజనేతరులకు ఏజెన్సీ ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకోవడం కోసం సర్కారు ప్రోత్సహిస్తూనే ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి నిర్ణయాల వల్ల ఏజెన్సీ ప్రాంతంలో మాకూ హక్కులు ఉన్నాయని వలస గిరిజనేతరులు చెలరేగిపోయి ఆదివాసుల హక్కుల చట్టాలపై దాడులు చేస్తున్నారు. రాజకీయ నాయకుల తప్పుడు నిర్ణయాల వల్లనే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఏజెన్సీ ప్రాంతంలో అమలవుతున్న చట్టాలపై ఆదివాసీల, గిరిజనేతరుల మధ్య గొడవలు సృష్టించకుండా ముగింపు పలకకపోతే భవిష్యత్తులో ఆదివాసీలు వారి హక్కులు, చట్టాలు రక్షణ కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. గిరిజనేతరులు, గిరిజనేతర అధికారులు, ఆదివాసీల అభివృద్ధి కోసం ఆదివాసీల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏలకు వచ్చే ప్రాజెక్ట్ అధికారులు ఆదివాసీల చట్టాలకు రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నారు. ఆదివాసుల పైన ముప్పేట జరుగుతున్న గిరిజనేతరుల దాడుల్లో మనుగడ కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆదివాసీల హక్కులు, చట్టాలు రక్షణ కోసం ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఐదో షెడ్యూల్ భూభాగానికి వలస వచ్చిన గిరిజనేతరులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఏజెన్సీ ఆదివాసీల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. 1/70 చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం1970 తర్వాత ఏజెన్సీ ప్రాంతాలకు వలస వచ్చిన గిరిజనేతర్ల గుర్తింపు కార్డులు రద్దు చేయాలి. వారిని మైదాన ప్రాంతాలకు తరలించాలి. అప్పుడే ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ సమాజం అభివృద్ధిలోకి రావడానికి అవకాశాలు మెరుగుపడతాయి.
- పూనెం శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షుడు, ఆదివాసీ సంక్షేమ పరిషత్