హాస్పిటళ్లలో ఔట్​సోర్సింగ్ ​దోపిడీ

హాస్పిటళ్లలో ఔట్​సోర్సింగ్ ​దోపిడీ
  • ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం చెల్లించని ఏజెన్సీలు
  • రాష్ట్రంలో దాదాపు 15 వేల మంది ఔట్​ సోర్సింగ్​ వర్కర్లు
  • ఒక్కో వర్కర్​కు రూ.వెయ్యికి పైగా నష్టం

మంచిర్యాల, వెలుగు: గవర్నమెంట్ ​హాస్పిటళ్లలో ఔట్ సోర్సింగ్​ దోపిడీ కొనసాగుతోంది. వివిధ విభాగాల్లో పనిచేసే వర్కర్లకు ఇచ్చేవే అరకొర జీతాలంటే అందులోనూ కొంత ఏజెన్సీలు దండుకుంటున్నాయి. ఇదేంటని అడిగేవారు లేకపోవడంతో అమాయకుల కష్టార్జితాన్ని గద్దల్లా తన్నుకుపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సర్కారు దవాఖానాల్లో పేషెంట్ కేర్, శానిటేషన్, స్వీపర్స్, సెక్యూరిటీ గార్డ్స్ తదితర సిబ్బంది ఔట్ సోర్సింగ్​లో పనిచేస్తు న్నారు. గవర్నమెంట్​ జనరల్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, వైద్య విధాన పరిషత్ విభాగం పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్, జిల్లా హాస్పిటల్స్​లో ఏజెన్సీల ద్వారా నియమించారు. 

ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ ​జిల్లాలోనే 700 మందికి పైగా పనిచేస్తుండగా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు15 వేల మంది ఉన్నారు. ఏజెన్సీల నిర్వాహకులు వీరిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ వారి జీతాలను కూడా దోచుకుంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం కాకుండా తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. కనీస వేతనాలు రూ.15,600 కాగా, కార్మికులకు రూ.12,093 చెల్లించి.. మిగిలిన డబ్బులు పీఎఫ్, ఈఎస్ఐ ఖాతాల్లో జమ చేయాలి. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ నిర్వాహకులు కుమ్మక్కై వర్కర్లకు రూ.10,500 నుంచి  రూ.11 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు.

 ఒక్కో వర్కర్​ నుంచి రూ.వెయ్యికిపైగా నొక్కుతున్నారు. ఇలా నెలనెలా లక్షల రూపాయలు కార్మికుల డబ్బులు కాజేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం వేతనాలు చెల్లించాలని ఆందోళనలు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని కార్మికులు వాపోతున్నారు. ఆలస్యంగా జీతాలు.. ఆపై వేధింపులుహాస్పిటళ్లలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సక్రమంగా వేతనాలు రావడం లేదు. ప్రభుత్వం బడ్జెట్​రిలీజ్​చేయడం లేదనే సాకుతో 3, 4 నెలలకోసారి జీతాలు ఇస్తున్నారు. పీఎఫ్ యజమాని వాటాను సైతం వర్కర్ల జీతం నుంచే కట్ చేసి జమ చేస్తున్నారు. ప్రభుత్వం విడిగా 12శాతం వాటా చెల్లించాల్సి ఉండగా అవసరమైన ఫండ్స్​ఇవ్వడం లేదు. అలాగే ఏజెన్సీ మారిన ప్రతిసారి వివిధ సాకులతో పాత వర్కర్లను తొలగిస్తున్నారు. 50 సంవత్సరాలు దాటిన వారిని కూడా తీసేస్తున్నారు.

 ఒక్కొక్కరి దగ్గర రూ.లక్షకు పైగా వసూలు చేసి కొత్తవాళ్లను నియమించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇక హాస్పి టల్ వర్కర్లకు డ్రెస్ చేంజ్ రూములు లేకపోవడంతో టాయిలెట్స్, బాత్రూముల్లో డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు. రెస్ట్ రూములు లేకపోవడంతో వరండాలు, వార్డులు, చెట్ల కింద భోజనాలు చేస్తున్నారు. వాళ్లకు ఐడీ కార్డులు, యూనిఫామ్స్, గ్లౌజులు, షూస్, ఇతర పరికరాలు సరిపడా ఇవ్వడం లేదు. దీంతో తాము అనేక అవస్థలు పడుతూ విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాంట్రాక్టర్ల వేధింపులను అరికట్టాలి

హాస్పిటళ్లలో పనిచేస్తున్న పేషంట్ కేర్, శానిటేషన్, స్వీపర్స్, సెక్యూరిటీ గార్డ్స్ చాలా సమస్యలతో బాధపడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన జీతాలు చెల్లించకుండా వర్కర్లను దోచుకుంటున్నారు. ఒక్కో ఏజెన్సీ నెలనెలా లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఏదో కారణం చెప్పి తొలగిస్తారనే భయంతో వర్కర్లు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వర్కర్ల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి. కాంట్రాక్టర్ల వేధింపులను అరికట్టాలి.- దుంపల రంజిత్​కుమార్, సీఐటీయూ జిల్లా సెక్రటరీ