
- దక్షిణ కాశ్మీర్లో 14 మంది టెర్రరిస్టుల లిస్టు విడుదల
- దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పాకిస్తాన్ పౌరుల గుర్తింపు
- వెనక్కి వెళ్లిపోయేందుకు ఇయ్యాల్నే డెడ్‌లైన్
- అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయుల కోసమూ గాలింపు
- బార్డర్లో కొనసాగుతున్న కాల్పులు.. బంకర్లలోకి జనం
- రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో ఆర్మీ చీఫ్ ద్వివేది భేటీ
న్యూఢిల్లీ: పహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ లో పర్యటించి వచ్చిన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. టెర్రర్ అటాక్ జరిగిన ప్రాంతాన్ని శుక్రవారం పరిశీలించిన ఆర్మీ చీఫ్ అనంతరం ఉధంపూర్ లోని నార్తర్న్ కమాండ్ లో ఆర్మీ సీనియర్ కమాండర్లతో భేటీ అయ్యారు. తర్వాత ఢిల్లీ చేరుకున్న జనరల్ ద్వివేది శనివారం రక్షణ మంత్రి అధికారిక నివాసానికి వెళ్లి ఆయనతో అరగంట పాటు సమావేశమయ్యారు. రక్షణ మంత్రితో ఆర్మీ చీఫ్మీటింగ్ కు సంబంధించి అధికారికంగా ఎలాంటి వివరాలు మాత్రం బయటకు వెల్లడికాలేదు. అయితే, ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో యుద్ధ సన్నద్ధత గురించి వివరించేందుకే రక్షణ మంత్రిని ఆర్మీ చీఫ్ కలిసి ఉండొచ్చని జాతీయ మీడియా వెల్లడించింది. సాధారణంగా సైన్యం చేపట్టే భారీ ఆపరేషన్లకు ముందుగా ఇలాంటి రివ్యూలు, భేటీలు జరుగుతుంటాయని, కానీ సైనిక చర్య చేపట్టేవరకూ ఆ వివరాలు బయటకు పొక్కకుండా సీక్రెట్‌గా ఉంచుతారని పేర్కొంది.
లోకల్ టెర్రరిస్టులు14 మంది
పహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో కాశ్మీర్ లోని లోకల్ టెర్రరిస్టుల భరతం పట్టేందుకు భద్రతా బలగాలు వేటను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా దక్షిణ కాశ్మీర్ లోని అనంతనాగ్, షోపియాన్, పుల్వామా జిల్లాల్లో మొత్తం 14 మంది మోస్ట్ వాంటెడ్ లోకల్ టెర్రరిస్టుల పేర్లతో లిస్టును శనివారం విడుదల చేశాయి. లిస్టులోని వాళ్లలో 8 మంది లష్కరే తోయిబా, దాని అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్, ముగ్గురు జైషే మహ్మద్, మిగతా ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థల కోసం పని చేస్తున్నారని గుర్తించారు. వారి కోసం గాలింపు తీవ్రం చేశారు. పహల్గాం టెర్రర్ అటాక్ ముందు వరకూ వీరంతా యాక్టివ్ గా ఉన్నట్టు కూడా భద్రతా బలగాలు గుర్తించాయి.
ఎల్ఓసీ వద్ద కొనసాగుతున్న కాల్పులు
నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ వరుసగా రెండో రోజు కూడా కాల్పులు కొనసాగించిందని ఇండియన్ ఆర్మీ శనివారం వెల్లడించింది. పాక్ బలగాలు రెండు రోజులుగా రాత్రిపూట కాల్పులు జరుపుతుండగా.. దీటుగా తిప్పికొడుతున్నామని తెలిపింది. లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ) వెంబడి అనేక చోట్ల ఇండియన్ ఆర్మీ పోస్టులపైకి పాక్ జవాన్లు ఫైరింగ్ చేశారని చెప్పింది. ఈ కాల్పుల్లో భారత్‌వైపు ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొంది.