పొద్దుగాల లేవంగనే చిన్నాపెద్ద కలిసి అడవిలోకి పోతరు. అప్పటికే చెట్ల నుంచి కింద పడ్డ ఇప్ప పూలు ఏరుతరు. ఇలా తెచ్చిన పువ్వుని వారం రోజులు కష్టపడి శుభ్రం చేస్తరు. ఇంత వరకు పడ్డ కష్టం ఒకటైతే.. తడి తగలకుండా పూలను దాచడం పెద్ద పని. ఈ పనే ఆదివాసీ తెగలకు అన్నం పెడుతుంది. ములుగు జిల్లా ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులకు వేసవి మొత్తం ఇట్లనే ఉపాధి దొరుకుతది.
(జయశంకర్ భూపాలపల్లి), వెలుగు : వేసవి కాలంలో ఎక్కువగా దొరికే ఇప్ప పూల కోసం ఏజెన్సీ ప్రాంతంలోని అడవి బిడ్డలు ఉదయాన్నే అడవులకు వెళ్తారు. చిన్నా, పెద్ద అంతా కలిసి ఇప్పపూలు సేకరిస్తారు. తెల్లవారేసరికి అడవిలోని ఇప్ప చెట్ల కింద కనిపించే పూలను ఏరుతుంటారు. ఈ సీజన్లో ఇప్పటికే ఇప్ప పువ్వు బాగా పూసింది. సేకరించిన పువ్వును ఆరబెట్టి.. గంపలు, బస్తాలు, కుండల్లో నిల్వ చేస్తారు.
మార్చి, ఏప్రిల్ నెలల్లో..
ఈ రెండు నెలల్లో ఇప్పపూలు ఎక్కువగా దొరుకుతాయి. వీటి కోసం గిరిజనులతో పాటు గిరిజనేతరులు కూడా పోటీ పడతారు.ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు సమీపంలోఉండే కుటుంబాలకు వీటి సేకరణే ప్రధాన ఆదాయం. వీటితో పాటు కానుగ, విషముష్టి, మారేడు, జీడి గింజలు, తేనె సేకరిస్తారు. ఇలా సేకరించిన వాటిని నేరుగా గిరిజన సహకార సంస్థకు విక్రయిస్తుంటారు.
అమ్మగా వచ్చిన డబ్బులతో ఈ సీజన్ గడిచిపోతుంది. "పూట గడవడానికి అడవితల్లి అండగా ఉంది. తగ్గిపోతున్న అడవులతో మాకు నష్టం జరుగుతుంది. మేము తీసుకొచ్చే గింజలు, పూలను ప్రభుత్వం మంచి రేటుకు కొంటలేదు. మధ్యలో ఉండేటోళ్లకు వాటిని అమ్మితే నష్టం తప్ప లాభం ఉండట్లేద'ని అంటున్నారు. గిరిజనులు. ఇక సీజన్ బట్టి ఉసిరికాయలు, బోడ కాకర, మొగిలి, తునికి, పాల, మొర్రి పండ్లు, పుట్టగొడుగులు, తునికాకు.. లాంటివి గిరిజనులు సేకరిస్తారు. వీటిల్లో కొన్నింటిని గ్రామాల్లో వారం, వారం సంతల్లో అమ్ముతారు. మిగతా రోజుల్లో ఇంటింటికీ తిరిగి విక్రయిస్తారు.
కొత్తల పండుగకు ఇప్ప పువ్వు
సేకరించిన ఇప్పపూలకు తడి తగలకుండా ఏ రోజుకారోజు జాగ్రత్తగా నిల్వ చేస్తారు. పువ్వు ఎండిన తర్వాత పూలపై ఉండే రెక్కలు రాలిపోయేలా రోకలితో జాగ్రత్తగా దంచుతారు. తర్వాత వాటిని గంపలు, కుండల్లో గాలి చేరకుండా మూత పెడతారు. ఆదివాసీలు ఎక్కువగా ఇప్ప పువ్వు సారా తయారు చేస్తారు. ఇది శరీరానికి బలం ఇవ్వడంతో పాటు వాత రోగాలను నయం చేస్తుందని వాళ్ల నమ్మకం. ఆదివాసీలకు పెద్ద పండుగ అంటే 'కొత్తల పండుగ'. వేసవిలో సేకరించిన ఇప్ప పూలను దాచి పెట్టి.. కొత్తల పండుగ సమయంలో వన దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు.
గిట్టుబాటు ధర లేక..
జీసీసీ(గిరిజన సహకార సంస్థ) గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో అటవీ ఉత్పత్తులు దళారుల పాలవుతున్నాయి. తెల్లవారక ముందే అడవిలోకి వెళ్లి ఇప్ప పూలు, గింజలు ఏరుకునే సమయంలో అడవి జంతువులు దాడులు చేస్తున్నాయి. ఇలా మాలో కొంతమంది చనిపోయారు. ఇంకొంత మంది గాయపడ్డారు. మాలాంటి వాళ్లకు ప్రభుత్వమే దారి చూపించాల'ని గిరిజనులు కోరుతున్నారు.