
- కాంట్రాక్టర్లు, అధికారులే సూత్రధారులు
- రిజిస్టర్లో ఆబ్సెంట్, బిల్లుల్లో ప్రెజెంట్..
- నెలల తరబడి లీవుల్లో వెళ్లిన వారి పైసలూ కొట్టేసిన్రు
- సుమారు రూ. రెండు కోట్ల వరకూ హాంఫట్
హైదరాబాద్ సిటీ, వెలుగు : జీహెచ్ఎంసీలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ కాంట్రాక్టర్లు, పలువురు అధికారులు కుమ్మక్కై కార్మికులు, ఉద్యోగుల జీతాలు కాజేస్తున్నారు. సెలవుల్లో ఉన్న వారు కూడా పనిచేసినట్లుగా చూపుతూ లూటీ చేస్తున్నారు. అనారోగ్యం, ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో, మెటర్నటీ సెలవుల్లో ఉన్న మహిళా ఉద్యోగుల జీతాలతో పాటు కరోనా టైంలో సెలవుల్లో ఉన్న ఎంప్లాయీస్జీతాలను కూడా వదల్లేదు.
ప్రతి నెల పలు విభాగాల్లో రూ.4 లక్షల వరకు ఈ విధంగా క్లెయిమ్చేసి దోచుకున్నారు. కొందరు కాంట్రాక్టర్లయితే ప్రతి నెలా ఇవ్వాల్సిన దాని కంటే తక్కువ జీతం చెల్లిస్తున్నారు. కొన్ని విభాగాల్లో ఉద్యోగులు లేకపోయినా ఉన్నట్లుగా చూపించి బల్దియా ఖజానాకు కన్నం పెడుతున్నారు. ఏ రోజైనా ఉద్యోగులు, కార్మికులు సెలవుల్లో ఉంటే బిల్లులు పెట్టినప్పుడు నెలలో అన్ని రోజులూ పని చేశారని చూపిస్తూ దండుకుంటున్నారు. వీటిని కాంట్రాక్టర్లు, అధికారులు కలిసి పంచుకుంటున్నారు.
ఎంటమాలజీలోనే జరిగిందిది...
జీహెచ్ఎంసీ లోని ఎంటమాలజీ విభాగంలో పనిచేసే అసిస్టెంట్ ఎంటమాలజిస్టుల(ఏఈ) జీతాలను హెడ్ ఆఫీసులో పనిచేసే ఓ ఉన్నతాధికారి, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లు కలిసి డ్రా చేశారు. ఏఈలు సెలవుల్లో ఉండి పని చేయని రోజుల్లో కూడా వారు పని చేసినట్టుగా చూపి జీతాలు డ్రా చేశారు. కొంతమంది అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు ఆరోగ్య సమస్యల కారణంగా సెలవులు పెట్టి నాలుగైదు వారాలు విధులకు హాజరు కాలేదు.
మరికొందరు ప్రమాదాల కారణంగా నెల వరకు డ్యూటీలు చేయలేదు. కరోనా టైంలో కోవిడ్ బారిన పడ్డ కొంతమంది ఉద్యోగులు సైతం సెలవులు పెట్టి క్వారంటైన్ లో, హాస్పిటల్స్ లో ఉన్నారు. ఆ టైంలోనూ వారు పని చేసినట్లుగా అటెండెన్స్ వేసి డబ్బులు కొట్టేశారు. బల్దియాలో పనిచేస్తున్న 33 మంది అసిస్టెంట్ ఎంటమాలజిస్టుల జీతాలు కూడా ఇలాగే నొక్కేశారు. అసిస్టెంట్ ఎంటమాలజిస్టులకు ప్రతి నెలా వేతనం చెల్లించే ఎలిగెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్, ఎంటమాలజీ విభాగంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, మరో సీనియర్ ఆఫీసర్కలిసి జీతాలు డ్రా చేయడంలో కీలకంగా వ్యవహరించారు.
ఐదేండ్లుగా దందా..
కూకట్ పల్లి జోన్ లో ఓ అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ (ఏఈ) 2022 జనవరిలో 12 రోజులు సెలవు పెడుతూ లీవ్ లెటర్ ఇచ్చాడు. కాంట్రాక్టర్ ఇచ్చిన లెటర్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అయితే, చీఫ్ ఎంటమాలజిస్ట్ ఆఫీసు సబ్మిట్చేసే ఫైనల్ అటెండెన్స్ షీట్ లో మాత్రం ఒక్కరు కూడా సెలవులో ఉన్నట్టు లేదు. ఆ నెలలో అందరూ ఏఈ లకు ఫుల్ జీతం వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. 2021 నవంబర్ లో యాక్సిడెంట్ కారణంగా మరో ఏఈ దాదాపు నెలన్నర సెలవు పెట్టాడు.
లీవ్ లెటర్ ను హెడ్ ఆఫీస్ లోని చీఫ్ ఎంటమాలజిస్ట్ కు ఇచ్చారు. అయినా రెండు నెలలు ఆయన పేరు మీద పూర్తి జీతాన్ని డ్రా చేశారు. అదే ఏడాది మరో ఏఈ అనారోగ్యంతో రెండు సార్లు వేరువేరుగా మూడు నెలలు సెలవు పెట్టారు. ఈ జీతాన్ని కూడా జేబులో వేసుకున్నారు. మెటర్నిటీ లీవులు, వారానికంటే తక్కువ సెలవులను కూడా ఇలాగే జేబుల్లోకి వేసుకున్నారు. ఫైనల్ అటెండెన్స్ షీట్లకు, కాంట్రాక్టర్ పేరుతో ఇచ్చే బిల్లులకు, ఆడిట్ ఫైళ్లను చూస్తే ఈ విషయాలను బయట పడ్డాయి. జీతాలు చెల్లింపులపై 2020 నుంచి విచారిస్తే దందా బయటపడే అవకాశముంది.
రూ.2 కోట్లకిపైగా స్వాహా....
అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ మాత్రమే కాకుండా ఈ విభాగంలో పని చేసే 2300 మంది కార్మికులు, సూపర్వైజర్ల జీతాలను కూడా ఇలాగే దండుకున్నట్టు సమాచారం. ఏడాదిన్నర క్రితం బయోమెట్రిక్ వచ్చిన తర్వాత ఈ దోపిడికి కొంత అడ్డుకట్ట పడినా ఎండ్‌కార్డు మాత్రం పడలేదు. అప్పుడు అన్నీ సెలవులుగా చూపితే ఇప్పుడు కొన్ని సెలవులు మాత్రమే చూపిస్తున్నారు. ఇలా 2020 నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.2 కోట్ల వరకు అధికారులు కాంట్రాక్టర్లతో చేతులు కలిపి కాజేశారు.
ఏఈల జీతం నెలకి రూ.23,600, వర్కర్ల జీతం నెలకి రూ.17,740 ఉంది. అయితే, జీహెచ్ఎంసీ నుంచి పూర్తి జీతాలు తీసుకుంటున్న ఏజెన్సీలు..ఉద్యోగుల ఖాతాల్లో మాత్రం సెలవుల డబ్బులు కోత విధించి జీతాలు వేస్తోంది. పైగా, జీహెచ్ఎంసీ నుంచి టైమ్ కి జీతాలు రావడం లేదని చెప్తూ ఒక్కొక్కరి నుంచి రూ.600 కట్ చేస్తున్నట్టు సమాచారం.