పత్తి కొనుగోళ్లలో దళారుల దందా

  •     గిట్టుబాటు ధర రూ. 15 వేలు ఇవ్వాలి
  •     ఇయ్యాల ఆసిఫాబాద్​లో రైతుల నిరసన

ఆసిఫాబాద్,వెలుగు: ఏజెన్సీ పత్తి రైతులను దళారులు నిలువునా ముంచుతున్నారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన అన్నదాతలు అప్పులపాలవుతున్నారు. ఈ ఏడాది భారీ వర్షాలు, వరదలకు రైతులు నిండా మునిగారు. వచ్చిన కొద్దోగొప్పో దిగుబడికి ‘మద్దతు’ దక్కడంలేదు. దిగుబడి తగ్గి కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలని,  మద్దతు ధర రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ శుక్రవారం రైతులు జిల్లా కేంద్రంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించనున్నారు.

సీసీఐ కొనకపోవడంతో..

జిల్లాలో ఈసారి 33,535 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేశారు. వర్షాలు, వరదల కారణంగా వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. చాలాచోట్ల మొలకలు ఎదగలేదు. ఇంకొన్ని చోట్ల పంట అంతా మురిగిపోయింది. రాత్రి వేళల్లో కురుస్తున్న మంచుకు తేమశాతం విపరీతంగా పెరిగింది. వచ్చిన కొద్దో గొప్పో దిగుబడిని అమ్ముకుందామంటే ఈసారి ప్రభుత్వం జిల్లాలో అసలే సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో చాలా మంది రైతులు పెట్టుబడి కోసం  చేసిన అప్పులు తీర్చేందుకు పత్తిని ప్రైవేట్ వ్యాపారులు, దళారులకు విక్రయించారు. ఇంకా కొందరు మద్దతు ధర లభించకపోతదా? అని ఇళ్లలో నిల్వ చేశారు.

అంతా దోపిడీ..

ఆర్థిక అవసరాలు, నిరక్షరాస్యతను ఆసరా చేసుకున్న దళారులు పత్తి రైతులను నిలువునా ముంచుతున్నారు. ఇష్టమొచ్చిన రేటుకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా చేతికందడంలేదు. చేసిన అప్పులు తీరడంలేదు.  జిల్లాలోని కెరమెరి, ధనోర, సుర్దాపూర్, సావర్ ఖేడా, సాంగ్వి, కెలి(కె),కెలి (బి), తెలంగాణ, మహారాష్ట్ర వివాదాస్పద గ్రామాల్లో దళారుల దర్జాగా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ధర, తూకంలో మోసం చేస్తున్నారు. అయినా ఆఫీసర్లు అటువైపు చూడడంలేదు. 

ధర వస్తదని ఆశతో ఉన్నాం..

ఎట్లున్న పత్తి అట్లనే ఇంట్లో ఉంది. రోజురోజుకు పత్తి ధర తగ్గుతోంది. మూడు ఎకరాల్లో పంట సాగుకోసం  మూడు లక్షలకుపైగా పెట్టుబడి పెట్టిన. మార్కెట్లో రేట్ ఎక్కువ ఉంటేనే అప్పు తీరుతది. ప్రైవేట్ లో 7 వేలకు కింటాలు కొంటున్నరు. పత్తి ధర పెంచాలె.  - మడావి నగేశ్, తిర్యాణి

పెట్టుబడి ఎక్కువ ధర తక్కువ

వర్షాలు, వరదలతో ఈసారి పంట రాలే. కానీ.. పెట్టుబడి మాత్రం తడిసి మోపేడైంది. వచ్చిన పంట అమ్ముదామంటే ధర తక్కువ ఉంది. ఇట్లయితే అప్పు ఎట్ల తీరుతది. పోయిన నెల 9 వేలకు ఉన్న పత్తి.. ఇప్పుడు 7 వేలకు పడిపోయింది. - కుమ్ర కాసిరాం, సిర్పూర్ (యు)