కార్పొరేట్ కంపెనీలతో ఏజెన్సీ రైతులకు కష్టాలు

కార్పొరేట్ కంపెనీలతో ఏజెన్సీ రైతులకు కష్టాలు
  • విత్తన ప్రయోగాలకు భూములను వాడుకుంటుండగా
  • 1500 ఎకరాల్లో పంట నష్టం..700 మంది రైతులు రోడ్డుపాలు
  • ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళ్తా.. 
  • రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్ మెంట్ చైర్మన్ పొదెం వీరయ్య వెల్లడి

వెంకటాపురం, వెలుగు: ఆదివాసీల భూములను కార్పొరేట్ కంపెనీలు విత్తనాల ప్రయోగ కేంద్రాలుగా వాడుకుంటున్నాయని రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్ మెంట్ చైర్మన్ వీరయ్య పేర్కొన్నారు. ఏజెన్సీలో మొక్కజొన్న సాగు చేసిన 700 మంది రైతులు నష్టపోయి, ఆర్థిక కష్టాలతో రోడ్డున పడుతుంటే స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

సోమవారం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో బాండ్ మొక్కజొన్న సాగు చేసి నష్టపోయిన రైతులను పరామర్శించి మాట్లాడారు. వెంకటాపురం, వాజేడు మండలాల్లో సుమారు 1500 ఎకరాల్లో పలు కార్పొరేట్ కంపెనీలు మొక్కజొన్న విత్తనాలు పంపిణీ చేశాయని, అధిక దిగుబడి వస్తుందని నమ్మించి 700 మంది రైతులను రోడ్డుపాలు చేశాయని మండిపడ్డారు.  

కార్పొరేట్ కంపెనీల బాండ్ అగ్రికల్చర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల  దృష్టికి తీసుకెళ్లి కంపెనీల ఆర్గనైజర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం మొక్కజొన్న సాగు చేసి నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడిన చిరుతపల్లికి చెందిన లేకం మధు కృష్ణ కుటుంబ సభ్యులకు సీడ్ ఆర్గనైజర్ ఇచ్చిన రూ 3.లక్షలు చెక్కును పంపిణీ చేశారు. ఆయన వెంట చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, పుణెం రాంబాబు, నాని తదితరులు ఉన్నారు.