సూర్యాపేట, వెలుగు: అర్హత లేని ఏజెన్సీలను రద్దు చేసి అర్హత ఉన్నవాటిని రెన్యూవల్ చేయాలని జిల్లా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ను ఏజెన్సీల నిర్వాహకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023 అక్టోబర్లో జిల్లాలోని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను ఎంప్యానల్లో చేర్చుటకు టెండర్ నిర్వహించారని, ఈ టెండర్లో 40 ఏజెన్సీలు అప్లయ్ చేసుకోగా 36 ఏజెన్సీలను అర్హులుగా గుర్తించారని తెలిపారు.
అయితే, జిల్లాలో అడిషనల్ కలెక్టర్ గా విధులు నిర్వహించిన వెంకటరెడ్డి, ప్రస్తుత ఎంప్లాయీమెంట్ అధికారి అక్బర్ అబీబ్ టెండర్ పాల్గొనని షిర్డీ సాయి, ఏకలవ్య, కేకేఆర్ ఏజెన్సీలను ఇటీవల ఎంప్యానల్ చేర్చి తమ వద్ద సర్వీస్ లను అక్రమంగా వారికి అంటగట్టారని తెలిపారు. అక్రమ పద్ధతిలో ఎంప్యానల్లోకి వచ్చిన ఏజెన్సీలను రద్దు చేయాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో ఏజెన్సీల నిర్వాహకులు సైదా, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.