- కొత్తగూడెం మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో అన్నీ సమస్యలే..
- వేధిస్తున్న సిబ్బంది, మందుల కొరత
- టెస్ట్‌ల కోసం ఇబ్బందులు పడుతున్న గర్భిణులు
- బీపీ ఆపరేటర్స్, సీటీజీ మిషన్లూ సరిగా పనిచేస్తలే..
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని ఏజెన్సీ ప్రజలకు గవర్నమెంట్ మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. హాస్పిటల్‌కు వచ్చే రోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. డెలివరీల సంఖ్య కూడా పెరిగింది. కానీ డాక్టర్ల సంఖ్య మాత్రం రోజు రోజుకూ తగ్గుతోంది. హాస్పిటల్లో అవసరమైన మెడిసిన్ కూడా దొరకడం లేదు. దీంతో పేషెంట్లు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు.
రోజూ100కు పైగా ఓపీ..
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రానికి జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులు డెలివరీ కోసం వస్తారు. కానీ సౌకర్యాలు సరిగా లేక వారికి అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుతం ఓపీ రోజుకు 100 నుంచి 150 వరకు ఉంటుంది. గతంలో వంద లోపే ఓపీ ఉండేది. గతంలో డెలివరీల సంఖ్య పదిలోపే ఉండగా ఇప్పుడు రోజుకు 15 నుంచి 20వ వరకు డెలివరీలు అవుతున్నాయి.
తగ్గుతున్న సీనియర్ డాక్టర్లు
మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో సీనియర్ గైనకాలజిస్టులు, డాక్టర్లు తగ్గుతున్నారు. గైనకాలజీ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు ఉంటే అందులో ఒకరు అనారోగ్యం, ఇతర కారణాలతో రెగ్యులర్‌గా రావడం లేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు నలుగురికి గానూ ఇద్దరే ఉన్నారు. డెలివరీల సంఖ్య పెంచడమే లక్ష్యంగా గత కలెక్టర్ పాల్వంచ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సీనియర్ గైనకాలజిస్ట్‌ను మాతా, శిశు ఆరోగ్య కేంద్రానికి రప్పించారు.. కానీ ఇప్పుడు ఆ గైనకాలజిస్ట్‌ను కూడా తిరిగి పాల్వంచ గవర్నమెంట్ హాస్పిటల్‌కు పంపించనున్నారు.
అలాగే హాస్పిటల్లో 8 మంది సీనియర్రెసిడెంట్ డాక్టర్లలో దాదాపు ఏడుగురు వచ్చే నెల మొదటి వారంలో తమ ట్రైనింగ్ పూర్తి చేసుకొని వెళ్లిపోనున్నారు. ఇటీవల చిన్నపిల్లల డాక్టర్ ఒకరు ట్రాన్స్ఫర్ అయ్యారు. మరో సీనియర్ పీడియాట్రిషియన్ జిల్లా గవర్నమెంట్జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా వెళ్లారు.
మిషన్లు పనిచేయట్లే..
మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో కీలకమైన మిషన్లు సరిగా పనిచేయడం లేదు. బీపీ ఆపరేటర్స్ హాస్పిటల్లో 10 నుంచి 15వరకు ఉండాలి. కానీ కేవలం మూడు మాత్రమే ఉన్నాయి. దీంతో ఆ మిషన్లనే అటు వార్డులు, ఇటు ఓపీలోకి తిప్పుతూ నెట్టుకొస్తున్నారు. గర్భిణికి నొప్పులు వచ్చిన టైంలో బిడ్డ హార్ట్‌బీట్, ఆరోగ్య పరిస్థితి చూసేందుకు ఉపయోగించే మూడు సీటీజీ మిషన్లు రిపేర్లలో ఉన్నాయి.
ALSO READ : సాహితీ భగీరథుడు దాశరథి రంగాచార్య
డెలివరీల టైంలో మేజర్ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఉపయోగించే పెన్సిలిన్ ఇంజక్షన్లు హాస్పిటల్లో అందుబాటులో లేవు. ఈ ఇంజక్షన్లను బయట నుంచి తెచ్చుకోవాలని డాక్టర్లు రోగులకు సూచిస్తున్నారు. ఈ ఇంజక్షన్ ఒక్కొక్కటి రూ. 500 వరకు ఉంటుండడంతో పేషెంట్లు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. యాంటిబయోటిక్స్ మందులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. మధ్యాహ్నం 2 గంటలు దాటితే గర్భిణులు స్కానింగ్ చేయించుకోలేని పరిస్థితి నెలకొంది.
ఆ టైమ్‌లో రూమ్‌కు తాళం వేస్తున్నారు. లివర్ ఫంక్షన్ టెస్ట్(ఎల్ఎఫ్టీ), కిడ్నీలకు సంబంధించిన టెస్ట్‌లు, పీటీఏపీటీపీ లాంటి టెస్ట్‌ల కోసం గర్భిణులను 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా గవర్నమెంట్జనరల్ హాస్పిటల్‌కు పంపిస్తున్నారు. అర్ధరాత్రి టైంలో జిల్లా జనరల్ హాస్పిటల్‌లోని టీ–హబ్ క్లోజ్ చేసి ఉంటుంది. దీంతో ప్రయివేట్ ల్యాబ్‌లను రోగులు ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ఇక్కడ గర్భిణులతో పాటు మహిళలు, చిన్నపిల్లలకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షగానే మారుతోందని పేషెంట్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.