ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న దళితులు వందల సంవత్సరాల నుంచి అదివాసులతో సమానంగా జీవనం సాగిస్తున్నా ఏజెన్సీ చట్టాలు దళితులకు వర్తించకపోవడం వలన దళితులు తీవ్రమైన అన్యాయానికి గురవుతున్నారు. ఏజెన్సీ చట్టాలు దళితులకు వర్తించకపోవడం వలన దళితులు చేసుకుంటున్న భూములకు శాశ్వత పట్టాలు పొందలేకపోతున్నారు. ఏజెన్సీ సర్టిఫికెట్స్ లేకపోవడం వలన దళితులలో చదువుకున్న యువత నిరుద్యోగులుగా మారుతున్నారు. భారతదేశంలో ఏజెన్సీ ప్రాంతాల పుట్టుక నుంచి ఏజెన్సీ దళితులు ఈ అడవి కొండ ప్రాంతాలలో జీవిస్తున్నారు అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి.
1935వ సంవత్సరంలో పోర్ట్ సేయింట్ జార్జ్ కమిషన్ ద్వారా ఏర్పడ్డ షెడ్యూల్ ప్రాంతాల చట్టంలో హిల్ ట్రైబల్స్గా గుర్తించబడి ఆదివాసులతో సమాన హక్కులు అనుభవించడం జరిగింది. స్వాతంత్యానికి పూర్వమే నిజాం సర్కార్ ఏజెన్సీ దళితులను సేవకులుగా గుర్తించి ఇనాం భూములను మాదిగ మాన్యాలు, ఎలామాన్యాలుగా ఇవ్వడం జరిగింది. ఆదివాసీ ధీరుడు కొమురం భీమ్ జీవిత చరిత రాసిన హేమన్ డార్ప్ (ది ట్రైబల్ అఫ్ ఇండియా) రచనలో సైతం ఏజెన్సీ దళితుల గురించి ప్రస్తావించడం జరిగింది. 1959 ఏల్టీఆర్ చట్టాలు రాకముందు అప్పటి భూరికార్డులైన సేత్వర్ పహాణిలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న దళితులకు పట్టాలు ఉన్నాయి. ఇన్ని ఆధారాలు ఉన్న ఏజెన్సీ దళితులను ఏజెన్సీ చట్టాల పరిధిలోకి తీసుకోని రాకపోవడం భారత ప్రభుత్వాలు చారిత్రాత్మక తప్పిదం చేసాయి అని చెప్పొచ్చు.
వందల సంవత్సరాలనుంచి ఆదివాసులకు సేవకులుగా ఉన్న ఏజెన్సీ దళితులు ఉన్నారు. తరతరాలుగా ఆదివాసులతో సమానంగా మమేకమై అన్నదమ్ములవలే బతుకుతున్న మాకు ఏజెన్సీ చట్టాలను వర్తింప చెయ్యాలని ఏజెన్సీ దళితులు ప్రభుత్వాలకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. వాస్తవానికి ఏజెన్సీ దళితులు ఆదివాసులను దోపిడీ చేసిన చరిత్రగాని, వారిపై ఆధిపత్యం చేసిన చరిత్రగాని ఎక్కడా లేదు. అయినా ఏజెన్సీ దళితులను ఏజెన్సీ ప్రాంతానికి వలస వచ్చిన వారిగా భావించి ఏజెన్సీ చట్టాల పరిధిలోకి దళితులను తీసుకురాకపోవడం చాలా అన్యాయం. అంతిమంగా ఏజెన్సీ దళితులు కోరుకునేది తమను ఏజెన్సీ వాసులుగా గుర్తించి, పుట్టిన అడవి మీద హక్కు కల్పించాలని కోరుకుంటున్నారు. కావున ఏజెన్సీ దళితుల న్యాయమైన డిమాండులను పరిగణనలోకి తీసుకొని సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి రాజకీయ పార్టీ ఏజెన్సీ దళితుల గురించి స్పష్టమైన వైఖరి వెల్లడించాల్సిన అవసరం ఉంది.
-
పల్లె నాగరాజు
ఏజెన్సీ దళితుల సేవా సంఘం, ములుగు జిల్లా