సార్వత్రిక ఎన్నికల సమరానికి మిగిలున్న ఎనిమిది నెలలు ప్రతిపక్షాలకు పరీక్షా సమయమే. దేశాన్ని మరింత మెరుగ్గా మార్చడానికి తమ దగ్గర ఎలాంటి ప్రణాళికలున్నాయి? ఎలాంటి పథకాలు అమలు చేయబోతున్నారు? అనే విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలగాలి. దేశంలో ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది’, మతోన్మాదం పెరిగిపోతుంది’ అని తొమ్మిదేళ్లుగా ఎవరెంత మొత్తుకుంటున్నా... బీజేపీ ఓట్ల శాతం తరగకుండా ఎందుకు పెరుగుతుందో ఆలోచించాలి. 2009 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 7.8 కోట్ల ఓట్లు వస్తే, 2019 నాటికి అవి సుమారు 23 కోట్లకు పెరిగాయి. ఇదే సమయంలో సుమారు 12 కోట్లతో కాంగ్రెస్ ఓట్ల శాతం స్థిరంగా ఉంది. విద్వేషం నెలకొన్న సమాజంలో ప్రేమానురాగాలను పెంపొందిస్తామని భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్‌గాంధీ ఇచ్చిన సందేశంతో కాంగ్రెస్‌కు కొత్త ఓటర్లను ఆకర్షించే శక్తి ఉందా..? అని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలి. ‘ఇండియా’ కూటమికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఎంత బలపడితే ఆ కూటమికి అంత ప్రయోజనం. బీజేపీ ప్రచారం చేస్తున్న ‘రైజింగ్ ఇండియా’కు కౌంటర్‌గా, ప్రతిపక్షాలు సరికొత్త నినాదాన్ని ఎత్తుకోవాలి. ఎన్నికల సమయంలో ప్రజలు తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. వాటిలో పాజిటివ్ విషయాలకే ప్రాధాన్యతిస్తారు కానీ, ప్రతికూల అంశాలకు చోటివ్వరు. వారి వ్యక్తిగత జీవితం, కుటుంబ సంక్షేమం ముందు వరసలో ఉంటే, దేశం, ప్రజాస్వామ్యం వారి ప్రాధాన్యతల్లో చివరి అంశాలుగా ఉంటాయి. ‘రాజ్యాంగం ప్రమాదంలో ఉంది’ అనే విషయంపై టీవీ చర్చల్లో మాట్లాడుకోవడానికి బాగుంటుంది కానీ, దీన్ని సగటు పౌరుడు పట్టించుకుంటాడా? అని ఆలోచించాలి.
నేతలకు కొదవలేదు
బీజేపికి వ్యతిరేకంగా భిన్నమైన అభిప్రాయాలున్న 28 పార్టీలతో కలిసున్న ‘ఇండియా’ కూటమి సర్వసభ్య కమిటీని ఏర్పాటు చేయడం గొప్ప ముందడుగే. కూటమిలో ఉన్న పార్టీలు 12 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల పరిధిలో సుమారు 300 లోక్‌సభ సీట్లున్నాయి. ఇలా చూసినప్పుడు ‘ఇండియా’ కూటమి బలహీనమైనదేం కాదు. ఇందులో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ వంటి మాస్ లీడర్లు ఉన్నారు. శరద్ పవార్ లాంటి తలపండిన రాజకీయ పండితుడు ఉన్నారు. లాలు ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ లాంటి యోధులున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించిన ఆప్ అధినేత కేజ్రీవాల్ ఉన్నారు. మహామహులున్న ఈ కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడం తెలివైన ఎత్తుగడ. దానికి తగ్గట్టుగా ఇచ్చిన ‘జుడేగా భారత్’ ` ‘ఇండియా జీతేగా’ అనే నినాదం కూడా ప్రజల హృదయాలను గెలుచుకునేదే! కానీ, వారి కొలమానంలో లేనిదల్లా... నరేంద్ర మోదీకి దీటుగా కూటమిలో కూడా బడానేతలున్నారనే సందేశాన్ని బయటికి పంపించలేకపోవడమే.
ప్రణాళికలు రూపొందాలి
2047 నాటికి భారత్‌లో అమృతకాలం వస్తుందని, భారత్ అభివృద్ధి చెందిన దేశంగా, ప్రపంచ శక్తిగా అవతరిస్తుందని బీజేపీ హామీలు కురిపిస్తున్నది. దీనికి వ్యతిరేకంగా ‘ఇండియా’ తమ ప్రణాళికలను రూపొందించాల్సి ఉంటుంది. దేశంలో 72 శాతం మంది ప్రజలు నిరుద్యోగాన్ని తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నట్లు ఒక సర్వేలో వెల్లడయింది. అలాగే, ప్రభుత్వ పాలసీలన్నీ బడా వ్యాపారులకే సాయపడుతున్నాయి తప్ప చిన్న చితకా వ్యాపారులకు కాదని 55 శాతం మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దేశంలో మెజారిటీ ప్రజలు తమ ఆర్థిక స్థితిగతులు రోజురోజుకు దిగజారుతూ ఎదుగుబొదుగు లేకుండా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. వీరిని తమవైపు తిప్పుకోవడానికి ‘ఇండియా’ కూటమి కృషి చేయాలి. అసమానతల గురించి ప్రతిపక్షాలు మాట్లాడాలి. పెరుగుతున్న పేదరికానికి విరుగుడును ప్రచారం చేయాలి. ‘ఇండియా’లో ఉన్న పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అనేక మంచి పథకాలున్నాయి. వాటిలో అత్యుత్తమ పథకాలను తమ ఎజెండాలో చేర్చాలి. బెంగాల్‌లో వెనకబడిన వర్గాల అమ్మాయిలు చదువుకునేలా ప్రోత్సాహం అందిస్తున్న ‘కన్యాశ్రీ ప్రకల్ప’, తమిళనాడులో ‘పాఠశాల విద్య’, రాజస్థాన్‌లో ‘చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్’, ఢిల్లీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వంటి పథకాలతో పాటు ఏపీలో ‘అమ్మఒడి’, దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని కూటమి ప్రచారం నిర్వహిస్తే ‘ఇండియా’కు దేశవ్యాప్తంగా ఆదరణ లభించే అవకాశాలున్నాయి.
భోవోద్వేగాలు ముందుకు రానున్నాయి
- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,పొలిటికల్ ఎనలిస్ట్